
ప్రతీకాత్మక చిత్రం
లక్నో(ఉత్తరప్రదేశ్): మైనర్లపై లైంగికదాడికి పాల్పటమే కాకుండా వారిని కూలీలుగా మార్చిన షుకర్తాల్ ఆశ్రమ యాజమానిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నెల 7న పిల్లల సంరక్షణ హెల్ఫ్‌లైన్ సమాచారం మేరకు పోలీసులు ఎనిమిది మంది పిల్లలను రక్షించిన విషయం తెలిసిందే. వీరంతా 7 నుంచి 10 ఏళ్లలోపు వారేనని పిల్లలంతా త్రిపుర, మిజోరం, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. స్వామి భక్తి భూషన్ గోవింద్ మహారాజ్ అనే వ్యక్తి షుకార్తాల్‌లో 2008లో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో సదరు మైనర్లంతా భూషన్ ఆశ్రమంలో నివసిస్తున్నారు. భూషన్ బాలికలను తరచూ లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా బలవంతంగా వారిని కూలీ పనుల నిమిత్తం ఇతరుల వద్దకు పంపించేవాడు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల పిల్లలను రక్షించి సంక్షేమ బోర్డు ముందు హాజరపరిచారు. వైద్య పరీక్ష నిమిత్తం పిల్లను ఆసుపత్రికి పంపించగా వీరిలో నలుగురు పిల్లలు లైంగిక వేధింపులకు గురైనట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఆశ్రమ యాజమాని భూషన్‌తో పాటు మిగతా సిబ్బందిని అరెస్టు చేశామని చెప్పారు. భూషన్ ఆశ్రమం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 323, 502, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పుగా ఈ కేసులో చిక్కుకున్నానంటూ భూషన్ పేర్కొన్నారు.