ఇటీవల పోలీసులను ఆశ్రయించిన బాధితులు, ఏజెంట్లు
‘ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు.. ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు రూ.లక్ష ఇంటి వద్దకే వచ్చి రుణం ఇప్పిస్తాం’ అంటూ పలమనేరులో పలు సంస్థలు వెలుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక వ్యక్తులు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. స్థానికంగా ఉండే కొందరు నిరుద్యోగులను మచ్చిక చేసుకుని వారు ఈ తంతంగాన్ని నడిపిస్తున్నారు. తాజాగా బైక్‌లపై గ్రామాల్లోకి వెళ్లి ఆధార్ కార్డు ఇస్తే చాలంటూ ప్రచారం చేస్తున్నారు. వీరి మోసపు మాటల వలలో పడి ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా మంది రూ.3700 చెల్లిస్తున్నారు. ఇప్పటికే రెండు సంస్థలు ఇలా మోసం చేసి బోర్డు తిప్పేశాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సాక్షి, పలమనేరు : పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఆశపడే వారున్నంతవరకు మోసం చేసే వారి జేబులు నిండుతూనే ఉంటాయి. వారం రోజుల కిందట ఖరీదైన కారులో ఓ యువకుడు పలమనేరులోని గడ్డూరు ఇందిరమ్మ కాలనీకొచ్చాడు. అతని మనుషులు కొందరు కర్ణాటకనుంచి బ్యాంకు అధికారి వచ్చారని ఆధార్ కార్డు చూపించి రుణాలు తీసుకోవచ్చంటూ ప్రచారం చేశారు. కేవలం గంటల వ్యవధిలో ఈ విషయం కాలనీమొత్తం పాకింది. భారీగా జనం ఆధార్ కార్డులతో అతని కారువద్దకు చేరుకున్నారు. నలుగురైదుగురుకి కలిపి రూ.30వేలు రుణమిస్తామని ఇందుకోసం ఆధార్‌కార్డునెంబరు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలని ఆయన చెప్పాడు. రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూపేనా రూ.60వేలు వసూలైంది.
మూడోరోజు ఆ బ్యాంకు అధికారి రాలేదు. ఆయన మొబైల్ స్విచ్‌ఆఫ్ అయింది. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండ్రోజుల క్రితం సీఐ శ్రీధర్ నిందితుడిని పట్టుకొచ్చారు. విచారణలో కర్ణాటక రాష్ట్రం కోలారుకు చెందిన ఉమెష్‌గా గుర్తించారు. ఎవరిదో ఖరీదైన కారు తీసుకుని షోకులు చూపి ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటాడని వెల్లడైంది. అతనిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు పంపారు. దురాశకుపోతే దుఃఖం తప్పదని తెలిసినా నిమిషాల్లో రుణాలు దక్కుతాయంటూ అడియాశకు పోయి చాలామంది ఉన్న డబ్బును పోగొట్టుకుంటున్నారు
పోలీసులకు ఫిర్యాదు..
పట్టణంలోని కొత్తపేటలో మూడేళ్ల కిందట వెలసిన ఓ సంస్థ మహిళలకు రుణాలిస్తామంటూ గ్రూపులను తయారు చేసింది. ఇందుకోసం వందలసంఖ్యలో ఏజెంట్లను పెట్టుకుంది. వారిద్వారా పల్లెల్లో పొదుపులు ప్రారంభించింది. ఇలా వీరివ్యాపారం కోట్లకు చేరుకుంది. ఆవెంటనే ఇక్కడున్న కార్యాలయం మూతపడింది. బాధితులు, ఏజెంట్లు కలసి సుమారు రూ.మూడుకోట్ల దాకా మోసపోయామంటూ పదిరోజుల కిందట స్థానిక పోలీసులు అశ్రయించారు. సంబంధిత సంస్థ నిర్వాహకులు ఇక్కడికొచ్చి త్వరలో డబ్బులు చెల్లిస్తామంటూ చెప్పినట్టు తెలిసింది.
రూ. లక్షకు లక్షంటూ మోసం
తమ సంస్థలో రూ.లక్ష డిపాజిట్ చేస్తే రెండేళ్లలో రూ.రెండు లక్షలిస్తామంటూ రెండేళ్ల కిందట పలమనేరు బజారువీధిలో ఓ సంస్థ వెలిసింది. స్థానికంగా ఏజెంట్లను పెట్టుకుని భారీగా డిపాజిట్లు సేకరించింది. ఏడాది తర్వాత సంస్థ బోర్డు తిప్పేసింది. పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పుంగనూరులో నిందితులను పట్టుకున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా రుణాలిస్తామని డిపాజిట్లు, రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టించుకునే వారిని ప్రజలు నమ్మకూడదు. అప్పటికప్పుడే రుణాలిచ్చి ఫీజు పట్టుకున్నా ఫర్వాలేదుగానీ ముందుగానే డిపాజిట్ చేయించుకుని ఆపై లోన్ ఇస్తామంటే మోసం చేస్తున్నట్టుగానే భావించాలి. ఇప్పటికే ఇలాంటి మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి సంస్థల మాయలో పడకూడదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మోసపోయామని చివర్లో మా వద్దకు వస్తున్నారు.
–శ్రీధర్, సీఐ, పలమనేరు
మాయమాటలు నమ్మకూడదు
ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా అప్పటికప్పుడే రుణాలిస్తామంటే జనం నమ్మేస్తున్నారు. ప్రజలు ఆశకు వెళ్లి మోసపోతున్నారు. ఇది జరిగేపనేనా అని కాస్త ఆలోచించాలి. మా వద్ద పని చేసేవారికి కూడా చెబుతున్నాం. ఇలాంటి మాయమాటలను నమ్మొద్దని సూచిస్తున్నాం. డబ్బులు ఊరికే వస్తాయా జాగ్రత్తగా ఉండాలి.
–రమేష్ రెడ్డి, పారిశ్రామిక వేత్త, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment