మోదీ హత్యకు కుట్ర? | Police recover Maoist letter which exposes plan to kill PM Modi | Sakshi
Sakshi News home page

మోదీ హత్యకు కుట్ర?

Published Sat, Jun 9 2018 1:04 AM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

Police recover Maoist letter which exposes plan to kill PM Modi - Sakshi

పుణె: ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారా? మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారా? అవుననే అంటున్నారు పుణె పోలీసులు. ప్రధానిని హత్య చేసేందుకు మావోయిస్టులు పెద్ద ప్రణాళిక రచించారంటూ వారు సంచలన విషయాన్ని బయటపెట్టారు.  ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా–కోరెగావ్‌లో జరిగిన అల్లర్లతో సంబంధమున్న ‘ఈల్గర్‌ పరిషద్‌’కు చెందిన ఒక వ్యక్తి అరెస్టుతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చిందని పుణె సెషన్స్‌ కోర్టుకు పోలీసులు తెలిపారు.

భీమా–కోరెగావ్‌ కేసులో ఈ వారంలో ముంబై, నాగపూర్, ఢిల్లీల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా.. వారిలో ఒకరైన రోనా విల్సన్‌ ఇంటి నుంచి పోలీసులు 3 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆ ఐదుగురిని సెషన్స్‌ కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా ఒక లేఖలోని అంశాల్ని పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల పవార్‌ కోర్టుకు వెల్లడించారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసిన తరహాలో రోడ్‌షోల్లో మోదీని లక్ష్యంగా చేసుకోవాలని లేఖలో ఉంది. తనను తాను ‘ఆర్‌’గా పేర్కొన్న ఒక వ్యక్తి.. మావోయిస్టు ప్రకాశ్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు.

హత్య కోసం ఎం–4 రైఫిల్, 4 లక్షల రౌండ్ల మందుగుండు సమకూర్చుకునేందుకు రూ. 8 కోట్లు అవసరముందని లేఖలో పేర్కొన్నారు’ అని పవార్‌ కోర్టుకు వెల్లడించారు. విల్సన్‌తో పాటు మరో నలుగురికి కోర్టు జూన్‌ 14 వరకు రిమాండ్‌ విధించింది. అరెస్టైన వారిలో విల్సన్‌తో పాటు లాయర్‌ సురేంద్ర గాడ్లింగ్, దళిత కార్యకర్త సుధీర్‌ ధావలే, షోమా సేన్, మహేశ్‌ రౌత్‌ ఉన్నారు.  విల్సన్‌ ఇంటి నుంచి పోలీసులు మరో 2 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒకదాంట్లో విప్లవ రచయిత వరవరరావు పేరు ఉంది. ఆయన మార్గదర్శకత్వం ఆధారంగా గడ్చిరోలి, చత్తీస్‌గఢ్, సూరజ్‌గఢ్‌లో జరిపిన దాడులతో మనకు దేశవ్యాప్తంగా పేరొచ్చిందని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.

అసలు లేఖలో ఏముంది..
‘హిందూ అతివాదాన్ని ఓడించడం మన ప్రధాన అజెండానే కాకుండా పార్టీ ముఖ్య కర్తవ్యం. సీక్రెట్‌ సెల్స్‌కు చెందిన పలువురు నేతలు, ఇతర సంస్థలు ఈ విషయాన్ని చాలా గట్టిగా నొక్కిచెప్పాయి. స్థానిక ఆదివాసీల జీవితాల్ని మోదీ నేతృత్వంలోని హిందూ అతివాద పాలన నాశనం చేస్తోంది. బిహార్, పశ్చిమ బెంగాల్‌ల్లో ఓడినా 15కిపైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్ని మోదీ ఏర్పాటు చేయగలిగారు. ఇదే వేగం కొనసాగితే అన్ని వైపులా నుంచి మన పార్టీకి భారీ నష్టం తప్పదు. మోదీరాజ్‌ను అంతమొందించేందుకు కామ్రేడ్‌ కిషన్, మరికొందరు సీనియర్‌ కామ్రేడ్స్‌ నిర్మాణాత్మక చర్యల్ని ప్రతిపాదించారు.

రాజీవ్‌ హత్య∙తరహాలో మేం ఆలోచిస్తున్నాం’ అని లేఖలో ఉంది. మే 21, 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో మహిళా ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చనిపోయారు.  ‘అయితే ఇది ఆత్మహత్యాసదృశ్యమే. దీని అమలులో మనం విఫలమయ్యే అవకాశమున్నా పార్టీ పీబీ(పోలిట్‌ బ్యూరో/సీసీ(సెంట్రల్‌ కమిటీ)ఈ ప్రతిపాదనపై ఆలోచన చేయాలని మనం కోరుకుంటున్నాం. మోదీ రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకోవడం ఉత్తమ వ్యూహం. అన్ని త్యాగాల కంటే పార్టీ మనుగడే ముఖ్యమని మనమంతా నమ్ముతున్నాం’ అని లేఖలోని అంశాల్ని పవార్‌ కోర్టుకు వివరించారు.  

రెండో లేఖలో ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ప్రస్తావన
ఇక రెండో లేఖను కామ్రేడ్‌ ఆనంద్‌ను ఉద్దేశిస్తూ కామ్రేడ్‌ ప్రకాశ్‌ రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పకుండా గొడవలకు దారి తీస్తుంది. మనం మూడు నెలల క్రితం ఒక రాష్ట్రంలో ప్రారంభించాం. అది మరో మూడు రాష్ట్రాలకు వ్యాపించింది. దళిత ప్రచారం విషయంలో మీరు చేసిన కృషి పట్ల సీసీ(సెంట్రల్‌ కమిటీ) ఆనందంగా ఉంది. దళిత అంశాలపై సెమినార్లు, ప్రసంగాల కోసం ఏడాదికి రూ. 10 లక్షలు ఇచ్చేందుకు సీసీ అంగీకరించింది’ అని లేఖలో ఉంది.  

మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు లేఖలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు మావోల నుంచి 2 బెదిరింపు లేఖలొచ్చాయి. ‘నన్ను, నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తూ మావోలు సీఎం కార్యాలయానికి ఈ లేఖలు పంపారు. ఇంతవరకూ నక్సల్స్‌ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరించారు’ అని ఫడ్నవిస్‌ చెప్పారు. ఈ లేఖల్లో గడ్చిరోలి ఎన్‌కౌంటర్లలో 39 మంది మావోలు మరణించిన అంశాన్ని ప్రస్తావించారని, వారం క్రితం ఈ లేఖలు సీఎం కార్యాలయానికి వచ్చాయని, దర్యాప్తు కోసం వాటిని పోలీసులు అందచేసినట్లు మహారాష్ట్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి.   

మూడో లేఖలో వరవరరావు ప్రస్తావన..
‘గత 4 నెలల్లో నక్సల్‌ సానుభూతిపరుడు వరవర రావు, కామ్రేడ్‌ సురేంద్ర గాడ్లింగ్‌ అందించిన మార్గనిర్దేశకత్వం ఆధారంగా మనం చేసిన దాడులతో జాతీయ స్థాయిలో పేరొచ్చింది.  గడ్చిరోలి, చత్తీస్‌గఢ్, సూరజ్‌గఢ్‌లో చేసిన దాడులు పేరు తీసుకొచ్చాయి. వచ్చే కొద్ది నెలలు వీటిని కొనసాగించాలి. ఇదే తరహా దాడుల్ని విజయవంతంగా కొనసాగించే బాధ్యతను వరవర రావుకు అప్పగించారు. వాటి కోసం సురేంద్రకు వరవర రావు నిధులు సమకూర్చారు. నిధులు సురేంద్ర మీకిస్తారు. మార్చి, ఏప్రిల్‌లో జరిగే సమావేశాల కోసం వరవర రావు, సురేంద్ర  వ్యక్తిగతంగా మార్గనిర్దేశకత్వం చేస్తారు’ అని కామ్రేడ్‌ ‘ఎం’ ఈ లేఖ రాశారని పోలీసులు చెప్పారు.

ఈ కథలు మోదీకి మామూలే
ప్రజాదరణ తగ్గినప్పుడల్లా ఇలాంటి కథలు అల్లడం సీఎంగా ఉన్నప్పటి నుంచి మోదీకి అలవాటేనని కాంగ్రెస్‌ పార్టీ నేత సంజయ్‌ నిరుపమ్‌ అన్నారు. లేఖల కల్పితమని చెప్పట్లేనని, విల్సన్‌ ఇంట్లో దొరికినట్లు చెపుతున్న లేఖలపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

మమ్మల్ని కలచివేశాయి: రవిశంకర్‌
మోదీని హత్య చేసేందుకు మావోలు కుట్ర పన్నారన్న కథనాలు తీవ్రంగా కలచివేశాయని, మావోయిస్టులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ అన్నారు. మావోల కుట్రను బయటపెట్టేలా నిజాయతీగా దర్యాప్తు జరగాలని, దోషులకు శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement