
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాల్లోని మా భారత పౌరులు చెడు పనులు చేసినట్లు తమకు సమాచారం అందిస్తే.. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపారు. తగిన ఆధారాలు అందిస్తే విచారణ జరిపేందుకు సహకరిస్తామని తెలిపారు.
అదే విధంగా భారత్- అమెరికా మధ్య సంబంధాలలో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకమైన అంశమని మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలను ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా విదేశాలలో తీవ్రవాద సంస్థల కార్యకలాపాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు.
కాగా అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్‌లో అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment