చికిత్స పొందుతున్న వెంకటస్వామి
నెల్లూరు(క్రైమ్): నగల దొం గతనం కేసులో అనుమానంతో కారు డ్రైవర్‌ను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు నిర్భందించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చివరకు అసలు నిందితులు దొరకడంతో సారీ చెప్పి వదిలి పెట్టారు. దీంతో బాధితుడు నడవలేని స్థితిలో జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి వివరాల మేరకు.. నగరంలోని కాపువీధికి చెందిన రాహుల్‌జైన్ బంగారు వ్యాపారి. ఆయన లైన్‌బిజినెస్ చేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని పలు జ్యుయలరీ దుకాణాలకు ఆర్డర్లపై బంగారు నగలు తయారీ చేసి సరఫరా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న రాహుల్‌జైన్ నెల్లూరు నుంచి కారులో కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరుల్లోని బంగారు వ్యాపారస్తులకు ఆభరణాలు ఇచ్చి వారు గతంలో బాకీ ఉన్న నగదును వసూలు చేసుకుని ఒంగోలుకు వెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ హోటల్ వద్ద కారును పార్క్ చేశారు. రాహుల్‌జైన్ అతని డ్రైవర్ వెంకటస్వామి భోజనం చేసేందుకు హోటల్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలి యని దుండగులు కారును మారు తాళాలతో తెరచి అందులో ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించుకుని వెళ్లారు. ఘటనపై ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టారు.
డ్రైవర్‌కు చిత్రహింసలు?
కోవూరు రాళ్లదిబ్బకు చెందిన పి.వెంకటస్వామి కారుడ్రైవర్. ఆదివారం అతని స్నేహితుడు అశోక్ ఫోన్‌చేసి రాహుల్‌జైన్‌ను తీసుకుని ఒంగోలు వెళ్లి రావాలని చెప్పాడు. దీంతో వెంకటస్వామి బంగారు వ్యాపారితో కలిసి ఒంగోలు వెళ్లాడు. ఈ క్రమంలో నగలు, నగదు చోరీకి గురవడంతో పోలీసులు తొలుత వెంకటస్వామిని అదుపులోకి తీసుకున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని వెంకటస్వామి చెబుతున్నప్పటికీ థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. మూడు రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అసలు దొంగ పాతడ్రైవరేనని తేలడంతో పోలీసులు సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న డ్రైవర్ వెంకటస్వామికి సారీ చెప్పి మంగళవారం రాత్రి వదిలివేశారు. దీంతో బాధితుడు నెల్లూరు చేరుకుని బుధవారం చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేరారు. ఈ విషయాలన్నింటిని బాధితుడు మీడియాకు వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. తాను నిర్దోషినని చెప్పినప్పటికీ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని వెంకటస్వామి భార్య వాపోయారు.
20 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం
జొన్నవాడ (బుచ్చిరెడ్డిపాళెం) : ఒంగోలులో పట్టపగలు ఓ హోటల్ వద్ద జరిగిన బంగారు దొంగతనం కేసులో జొన్నవాడలో మరో 20 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు బంగారు నగల వ్యాపారి రాహుల్‌జైన్ కారులో చోరీ జరిగిన బంగారు నగల రికవరీలో భాగంగా ఒంగోలు వన్ టౌన్ ఎండీ షబ్బీర్ జొన్నవాడ సర్పంచ్ పిల్లెల్ల మురళీమోహన్ కృష్ణకు బుధవారం ఫోన్ చేశారు. వీడియో కాల్ ఆధారంగా నిందితులు ముసునూరు ఓంకార్, కందికట్టు రాజశేఖర్ బంగారు నగలు దాచి ఉంచిన ఇంటికి పంపారు. అక్కడ మట్టిలో దాచిన ఏడు ఆభరణాలు (దాదాపు 20 సవర్లు) వెలికి తీశారు. వాటిని నగల వ్యాపారి రాహుల్‌జైన్ స్వాధీనం చేసుకుని ఒంగోలుకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment