సాక్షి, చెన్నై: పొల్లాచ్చిలో యువతుల జీవితాలతో చెలగాటమాడిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలన్న నినాదం మిన్నంటుతోంది. వీరితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లందర్నీ అరెస్టు చేసి నడి రోడ్డులో ఉరి తీయడమే కాక, ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తరగతుల్ని బహిష్కరించిన విద్యార్థులు రాస్తారోకోలు, ధర్నాలతో ముందుకు సాగారు. ఇక, ఈ కేసు విచారణను సీబీసీఐడీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. ఐజీ శ్రీధర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. కాగా ప్రజల్లో ఈ వ్యవహారంపై ఆగ్రహం పెల్లుబిక్కుతుండడంతో కేసును సీబీఐకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.
(అన్నా నన్ను వదిలేయి, నిన్ను నమ్మికదా వచ్చాను)
మాయమాటలతో స్నేహం ముసుగులో విద్యార్థినులను, యువతులను బలవంతంగా లొంగదీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతూ వచ్చిన మృగాళ్ల బండారం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తిరునావుక్కరసర్, శబరి, సతీష్, వసంతకుమార్‌లను అరెస్టు చేశారు. వీరితో పాటు తెర వెనుక మరెందరో ఉన్నారని, రాజకీయనాయకుల వారసులు సైతం ఉన్నట్టుగా ఆరోపణలు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ రాక్షసుల్ని కాల్చి చంపాల్సిందేనన్న నినాదం తెరపైకి రావడంతో కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. దీంతో ఐజీ శ్రీధర్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది.
విచారణ వేగవంతం
ఐజీ శ్రీధర్ నేతృత్వంలోని బృందం పొల్లాచ్చి పోలీసుల చేతిలో ఉన్న కేసును బుధవారం తమ గుప్పెట్లోకి తీసుకుంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను కోర్టులో సమర్పించి ఉండడంతో అందులోని వివరాలను తెలుసుకునేందుకు ఐజీ బృదం చర్యలు చేపట్టింది. అలాగే కొన్నేళ్లుగా ఈ మృగాళ్లు సాగిస్తూ వచ్చిన వ్యవహారంలో ఎందరో యువతులు తీవ్ర కష్టాల్ని అనుభవించి ఉండడం వెలుగులోకి రావడంతో ఆ అంశంపై సీబీసీఐడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. లైంగిక దాడికి గురైన యువతులు మరెందరో ఆత్మహత్యలు సైతం చేసుకున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో నాలుగైదేళ్లుగా ఆత్మహత్యలు చేసుకున్న యువతుల జాబితాను సేకరించి, అందుకు గల కారణాల అన్వేషణపై పడ్డారు.
అలాగే, ఆనమలైలోని తిరునావుక్కరసర్ నివాసం, చిన్నమ్మపాళయంలోని ఫామ్‌హౌస్‌లలో తనిఖీలు సాగాయి. గూండా చట్టంలో అరెస్టుయిన ఈ నిందితుల్ని తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు తగ్గ కసరత్తుల్లో సీబీసీఐడీ ఉంది. అలాగే, తిరునావుక్కరసర్‌కు సేలంలో ఆశ్రయం కల్పించి ఉన్న యువతి కోసం వేట మొదలెట్టారు. ఓ డాక్టరు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు స్పందించలేదన్న సమాచారంతో, ఆ డాక్టరు వివరణ తీసుకునేందుకు నిర్ణయించారు. నిందితుల అరెస్టు, గూండా చట్టం నమోదు అన్నీ కపటనాటకాలేనని, తక్షణం విచారణ సాగాలని, నడిరోడ్డులో ఉరి తీయాలన్న నినాదంతో రాష్ట్రంలో విద్యార్థినుల ఆక్రోశం కట్టలు తెంచుకుంది.
నిరసనల హోరు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులు తరగతుల్ని బహిష్కరించారు. ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. చెన్నై మధురవాయిల్, పూందమల్లి హైరోడ్డు పరిసరాల్లో విద్యార్థులు కదం తొక్కడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఇక పొల్లాచ్చిలో సాగిన భారీ నిరసన పోలీసులకు ముచ్చెమటలు పట్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు రోడ్డుపై భీష్మించుకుని కూర్చోవడంతో బలవంతంగా వారిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్తత తప్పలేదు. ఇక, పొల్లాచ్చిలో నిందితులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన, తిరునావుక్కరసర్ మిత్రుడు నాగరాజన్‌పై స్థానికులు కన్నెర్ర చేశారు. కోట్టూరు రోడ్డులోని నాగరాజన్‌కు చెందిన బార్‌ను ధ్వంసం చేశారు. నిరసనలు ఓ వైపు ఉద్రిక్తం కావడంతో ఎన్నికల వేళ విద్యార్థుల రూపంలో ఏదేని కొత్తసమస్యలు తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణించినట్టున్నది.
కేసును ఆగమేఘాలపై సీబీఐకు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు వివరాలను తెలియజేస్తూ సమగ్ర విచారణ చేపట్టాలంటూ సీబీఐకు సిఫారసు చేసినా, అక్కడి నుంచి ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ హడావుడిపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగానే స్పం దించారు. బాధిత యువతులకు న్యాయం జరిగే రీతిలో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ ప్రత్యేక సిట్ విచారణ సాగాలని డిమాండ్ చేశారు.
వైరల్‌గా వీడియోలు
ఈ లైంగిక వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రోజుకో వీడియో, ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. యువతులను వేధిస్తున్న వ్యవహారాలు వైరల్‌గా మారడంతో తాము బాధితులం అంటూ ఆడియోలను పంపించే యువతుల సంఖ్య పెరుగుతుంది. అలాగే, ఓ యువతి అయితే, ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి తొలి కేసు పెట్టింది తానేనని, ఈ వ్యవహారంలో ప్రస్తుతం రాజకీయ శక్తులు ప్రవేశించి ఉన్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంలో రాజకీయ పెద్దలకు చెందిన వాళ్లెవ్వరూ లేరని, హఠాత్తుగా ఈ వ్యవహారంలోకి రాజకీయ ముసుగు ప్రవేశించి ఉండడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. అలాగే, తిరునావుక్కరసర్, శబరిలను కొందరు వ్యక్తులు పోలీసులకు అప్పగించే ముందు చితక్కొట్టి వాంగ్మూలం తీసుకుని ఉన్న వీడియో విచారణకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.
తల్లిపై శివాలు..
తన కుమారుడు ఏ తప్పు చేయలేదని, అతడికి బెయిల్ ఇప్పించేందుకు ముందుకు రావాలని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునావుక్కరసర్ తల్లి లత న్యాయవాదుల్ని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు ఎవ్వరూ నిందితుల తరఫున కోర్టుల్లో హాజరు కాకూడదని నిర్ణయించి ఉన్నారు. అలాగే, నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్న నినాదంతో ఆందోళనలు సైతం పొల్లాచ్చి, కోయంబత్తూరు కోర్టుల పరిసరాల్లో సాగాయి. ఈ పరిస్థితుల్లో నిందితుడు తిరునావుక్కరసర్ తల్లి లత పొల్లాచ్చి కోర్టు వద్దకు వచ్చారు. ఈ సమయంలో అక్కడున్న న్యాయవాదులు ఆమెపై శివాలెత్తారు. తిరునావుక్కరసర్ చేసిన పనికి పొల్లాచ్చి ప్రజానీకం దేశం ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. అలాంటి కొడుకును వెనకేసుకు రావడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు.
దీంతో అక్కడి నుంచి లత జారుకోక తప్పలేదు. లైంగిక దాడి వ్యవహారంలో మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు. పొల్లాచ్చికి చెందిన బాలన్‌కు సైతం ఈ వేధింపుల్లో ప్రమేయం ఉన్నట్టు తేలడంతో బాలన్ అనే యువకుడ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. (అన్నా నన్ను వదిలేయి, నిన్ను నమ్మికదా వచ్చాను)
Comments
Please login to add a commentAdd a comment