మొదటి బాయ్‌ఫ్రెండ్ ఆశ్లే సేస్‌తో లూజీ బాయిస్
సాక్షి, న్యూఢిల్లీ : తన బిడ్డకు తండ్రి ఎవరో తప్పు చెప్పినందుకు తల్లికి, అవును ఆ బిడ్డకు తండ్రిని తానేనంటూ నాటకమాడిన ఆ తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్‌కు వెస్ట్ వేల్స్‌లోని స్వాన్‌సీ క్రౌన్ కోర్టు జైలు శిక్ష విధించింది. వారిద్దరు జైలు శిక్ష పూర్తి చేసుకొని వచ్చేవరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను స్వయంగా చూసుకోవాల్సిందిగా ఆ బిడ్డ అసలు తండ్రి ఆశ్లే సేస్‌ని కోర్టు ఆదేశించింది. వెస్ట్ వేల్స్‌లోని మాన్‌సెల్టన్‌కు చెందిన లూజీ బాయిస్ (30) మూడు నెలల క్రితం ప్రసవించింది. అప్పటికే తన మొదటి బాయ్‌ఫ్రెండ్ ఆశ్లీసేస్‌తో ఆమె గొడవపడి విడిపోయింది. పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వెస్ట్ వెల్స్ నిబంధనల ప్రకారం బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరు బర్త్ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లి బిడ్డ పేరిట సర్టిఫికెట్ తీసుకోవాలి.
మొదటి బాయ్ ఫ్రెండ్‌తో గొడవ పడి విడిపోయినందున ఇక అతనితో ఎలాంటి సంబంధాలు ఉండరాదని భావించిన లూజీ బాయిస్, తాను ప్రస్తుతం ప్రేమిస్తున్న 34 ఏళ్ల నాథన్ లెగట్‌తో కలిసి బిడ్డ సర్టిఫికెట్ కోసం వెళ్లింది. అక్కడ అధికారుల ముందు బిడ్డకు తల్లిగా సంతకం చేసింది. ఆ తర్వాత అధికారులు బిడ్డకు తండ్రి మీరేనా? అంటూ నాథన్ లెగట్‌ను అడిగారు. అందుకు ఆయన అవునంటూ సంతకం చేస్తూ భోరుమని ఏడ్చారు. దీంతో అధికారులకు సందేహం వచ్చింది. వారిని విచారించి అసలు తండ్రి ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యతను అధికారులు ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు. ఎన్జీవో సంస్థ డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నాథన్ లెగట్ తండ్రి కాదని, లూజీ బాయిస్ మొదటి బాయ్ ఫ్రెండే ఆశ్లే లేస్ తండ్రని తేల్చింది.
అబద్ధమాడిన రెండో బాయ్‌ఫ్రెండ్ నాథన్, లూజీ బాయిస్, మొదటి బాయ్‌ఫ్రెండ్ ఆశ్లే సేస్
ఇందులో తల్లి బాయిస్, తండ్రిగా నాథన్ లెగట్‌లు అబద్ధామాడినందుకు వారిపై పోలీసులు కేసు పెట్టి కేసు విచారణను స్వాన్‌సీ కోర్టుకు అప్పగించారు. బిడ్డ విషయంలో అబద్ధమాడినందుకు కోర్టు తల్లికి ఎనిమిది నెలల జైలు శిక్ష, తాజా బాయ్ ఫ్రెండ్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రెండు రోజుల క్రితం తీర్పు చెప్పింది. తన మాజీ ప్రియురాలు లూజీ బాయిస్ అన్నా, తమ ఇద్దరికి పుట్టిన బిడ్డ అన్నా ఇప్పటికీ తనకు ఇష్టమేనని విచారణ సందర్భంగా అంగీకరించిన బిడ్డ అసలు తండ్రి ఆశ్లే లేస్‌కే వారు విడుదలై వచ్చే వరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను కోర్టు అప్పగించింది. అయితే శిక్షపడే నాటికి బాయిస్ రెండోసారి గర్భంతో ఉంది. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరో కోర్టు ప్రశ్నించలేదు, తల్లి కూడా ఎవరికి చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment