
ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
స్పందించని హైవే సిబ్బంది.. హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించాల్సిన హైవే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఘటనలో కూడా మరోసారి వారి నిర్లక్ష్యం కనిపించింది. సంఘటన స్థలానికి చేరుకుని ఎంతకూ హైవే సిబ్బంది రాకపోవడంతో పోలీసులే రోడ్డుకు ఇరువైపులా కోన్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రోడ్డు డివైడర్‌పై పడిన బస్సును తొలగించడానికి హైవేకు చెందిన క్రేన్స్ కూడా సకాలంలో రాలేదు. దీంతో ప్రైవేట్ క్రేన్ ద్వారా పోలీసులు తొలగిస్తుండగా ఉదయం 8 గంటల ప్రాంతంలో హైవేకు చెందిన క్రేన్ అక్కడకు చేరుకుంది.
ప్యాపిలి: పట్టణ సమీపంలోని స్థానిక చిరుతలగుట్ట మలుపు వద్ద బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతిచెందగా మరో పదిమంది గాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు.. ఏఆర్ 01టీ 5445 నంబర్ గోటూర్ ట్రావెల్స్ బస్సు గత రాత్రి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్థానిక చిరుతలగుట్ట మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ తమిళ్ అర్సన్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును కుడివైపునకు మరల్చడంతో రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌పై బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ తమిళ్ అర్సన్, పసుపులేటి ఆదిత్య (27), శ్రీనివాసరెడ్డి, క్రిష్ణ, సత్యవతి, శృతి చౌదరి, మురళీక్రిష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి, భాస్కర్‌తో పాటు మరొకరు గాయపడ్డారు. సీఐ రామక్రిష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుత్తి, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
మృతుడు హైదరాబాద్ వాసి..
తీవ్రంగా గాయపడిన పసుపులేటి ఆదిత్యను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇతడు హైదరాబాదులోని కొండాపూర్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరులో బయో డిజైన్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న ఎస్పీ గోపీనాథ్‌జట్టి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment