
మేడిపెల్లి (వేములవాడ): జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం తొంబర్రావుపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి రాగుల సురేశ్(31) బుధవారం హత్యకు గురయ్యాడు. తన కూతురితో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే కారణంతో అదే గ్రామానికి చెందిన నల్ల గంగారెడ్డి, కొడుకు సంతోష్‌రెడ్డితో కలసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. సురేశ్ మేడిపెల్లి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్. ఆయనకు భార్య శైలజ(25), కూతురు మోక్ష(2) ఉన్నారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు.
సదరు మహిళ విడాకులు తీసుకుని ఇంటి వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె విడాకులకు సురేశ్ కారణమని భావించిన గంగారెడ్డి పలు మార్లు సురేశ్‌ను హెచ్చరించాడు. ఈ క్రమంలో సురేశ్ తన మిత్రుడితో కలసి బైక్‌పై వస్తుండగా శివారులో దారికాచి దాడి చేశారు. కొడవలితో మెడపై, కడుపు భాగంలో పొడిచారు. తీవ్రంగా గాయపడిన సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీనర్సయ్యపైనా దాడికి యత్నించగా పారిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.