
సాక్షి, హైదరాబాద్: రాజధాని కేంద్రంగా మరో నకిలీ ఇన్వాయిస్ రాకెట్ వెలుగులోనికి వచ్చింది. సరుకులు తయారీ, రవాణా చేయకుండానే రూ.133 కోట్ల వ్యాపారం చేసినట్లు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించిన 5 కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడటంతో పాటు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో రూ.22.64 కోట్లను ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందాయి. ఈ బాగోతాన్ని మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు వెలుగులోకి తెచ్చారు. నకిలీ ఇన్వాయిస్‌ల సృష్టికి కలకత్తా పెట్టింది పేరు. బోగస్ వ్యాపారులకు అవసరమైన నకిలీ ఇన్వాయిస్‌లు తయారు చేసి ఇవ్వడానికి అక్కడ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు ఉంటాయి. ఇలాంటి ఓ సంస్థ నుంచి మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్‌కు ఓ సమాచారం అందింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు ఐదు కంపెనీల అక్రమాలను గుర్తించారు.
కూకట్‌పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన హిందుస్తాన్ ఏఏసీ ప్రొడక్ట్స్, ఐత్రి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్, శ్రీకృష్ణా క్యాస్టింగ్స్, శ్రీ మెటల్స్, ఆవ్యా ఎంటర్ ప్రైజెస్‌లు ఎంఎస్, కాపర్, మెటల్ తుక్కు పదార్థాల తయారీ, రవాణా వ్యాపారాలు చేస్తున్నాయి. ఈ ఐదూ 2017 జూలై నుంచి నకిలీ ఈ–వే బిల్లులు సృష్టించడం మొదలెట్టాయి. నకిలీ ఇన్వాయిస్‌ల సాయంతో ఈ కాలంలో మొత్తం రూ.131 కోట్ల మేర వ్యాపారం చేశామని రికార్డులు సృష్టించాయి. దీనికి సంబంధించి చెల్లించాల్సిన రూ.22.64 కోట్ల జీఎస్టీని ఐటీసీ కింద చూపిస్తూ వచ్చాయి. ఫలితంగా ఆయా సంస్థలు చేస్తున్న వ్యాపారానికి రూ.131 కోట్ల అదనంగా చేసినట్లు రికార్డులు తయారుచేశాయి. దీనికితోడు చెల్లించాల్సిన పన్నులో రూ.22.64 కోట్లు ప్రభుత్వం నుంచే తీసుకున్నాయి. అయితే కలకత్తా నుంచి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ కమిషనరేట్ నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించారని, అసలు సరుకు తయారీ రవాణా కాలేదని నిర్థారించారు. దీంతో ఆ ఐదు సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ సంస్థలను నలుగురు నిర్వహిస్తున్నారని తేలింది. ప్రాథమికంగా నేరం నిరూపణ కావడంతో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
స్కూటర్లపై సరుకు రవాణా చేశారట!
జీఎస్టీ అధికారులు జరిపిన దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిశాయి. సాధారణంగా సరుకు తయారీ సంస్థలు వాటి రవాణా కోసం ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్ వాడుతాయి. అయితే నకిలీ ఈ–వేబిల్స్ సృష్టించిన ఈ ఐదు సంస్థల్లో వాటిపై సరుకు రవాణా వాహనాల నంబర్లు అంటూ కొన్నింటిని పొందుపరిచాయి. అయితే అసలు సరుకే లేనప్పుడు ఇక రవాణా ఏమిటని అనుమానం వచ్చిన జీఎస్టీ అధికారులు ఆ కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయా రిజిస్ట్రేషన్ నంబర్లతో సరుకులు రవాణా చేసే వాహనాలు లేవని, ప్రయాణికులను చేరవేసే వాహనాలు, స్కూటర్లు, ట్రాక్టర్ల నంబర్లను వినియోగించారని బయటపడింది. రూ.20 లక్షల నగదుతో పాటు 4,150 అమెరికన్ డాలర్లు, ఇతర నకిలీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు మేడ్చల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment