ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,సిటీబ్యూరో: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతితో పాటు ఆమె తండ్రిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడో శాడిస్ట్. అతడి తీరు శృతిమించడంతో బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినికి కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు చాటింగ్ చేసుకున్నారు. చనువు పెరగటంతో సదరు యువతి వ్యక్తిగత విషయాలనూ చాట్ చేయడం మొదలెట్టింది. అయితే పరీక్షలు సమీపిస్తున్నాయనే ఉద్దేశంతో ఆమె చాటింగ్‌కు దూరంగా ఉంది.
దీంతో ఆమెను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించిన ఆ యువకుడు తనతో చాటింగ్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. గతంలో చాటింగ్ ద్వారా చర్చించుకున్న వ్యక్తిగత విషయాలను మీ తండ్రికి పంపిస్తానంటూ బెదిరించేవాడు. తనకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో తాను చదువుకోవాలని, అందుకే ప్రస్తుతం చాటింగ్ చేయలేనంటూ ఆమె వేడుకున్నా అతగాడు వినకుండా ఆ చాటింగ్స్‌ను యువతి తండ్రికి పంపాడు. అంతటితో ఆగకుండా తన ఇంట్లో ఎవరూ లేరని, మీ కుమార్తెను నాకు భోజనం పెట్టేందుకు పంపించాలంటూ యువతి తండ్రినే కోరడం మొదలెట్టాడు. చాటింగ్ హిస్టరీని సోషల్‌మీడియాలో పెట్టి మీతో పాటు మీ కుమార్తెను బజారుకు ఈడుస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఇతడి వేధింపులు తారా స్థాయికి చేరడంతో బాధితురాలు సోమవారం సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. బ్లాక్‌మెయిలింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment