సాక్షి, ఖెరతాబాద్: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును సైఫాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. విషం తాగడం వల్లే అతను మృతిచెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతడు ఏ విషం తాగాడన్నది విస్రా నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలియనుంది. అయితే ఈలోపు మారుతీరావు విషాన్ని ఎక్కడ ఖరీదు చేశారు? ఎక్కడ తాగారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. మారుతీరావు బస చేసిన వైశ్యాభవన్ రూమ్ నెం.306లో, ఆయన కారులో ఎలాంటి విషం డబ్బాలు, సీసాలు లభించకపోవడంతో విషయం జటిలంగా మారింది. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ'
మారుతీరావు శనివారం మిర్యాలగూడ నుంచి తన కారులో డ్రైవర్ రాజేష్‌తో కలిసి బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ ఎరువులు, పురుగు మందుల దుకాణం వద్ద కారు ఆపాలని డ్రైవర్‌తో చెప్పారని తెలిసింది. ఆ దుకాణంలోకి వెళ్లిన ఆయన కొద్దిసేపటి తర్వాత వచ్చి తిరిగి బయలుదేరారు. అక్కడ నుంచి నేరుగా కారులో ఖైరతాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌కు వచ్చి బస చేశారు. రాజేష్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసుల ఆ దుకాణంలోనే పురుగు మందు లేదా గుళికలు ఖరీదు చేసి ఉంటారని భావిస్తున్నారు. శనివారం రాత్రి డ్రైవర్‌తో గారెలు తెప్పించుకున్న మారుతీరావు వాటిలో కలుపుకుని విషాన్ని తిని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ విషం ప్రభావంతోనే ఆయన వాంతులు చేసుకుని ఉంటారని చెప్తున్నారు. విస్రా నివేదిక వచ్చి తర్వాతే విషం ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తుందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
మారుతీరావు కాల్ డిటైల్స్‌ను పరిశీలిస్తున్న పోలీసులు శనివారం రాత్రి 8.22 గంటలకు ఆయన ఆఖరి ఫోన్ కాల్ చేశారని, మల్లేపల్లిలో ఉండే తన న్యాయవాది వెంకట సుబ్బారెడ్డితో మాట్లాడినట్లు పోలీసులు తేల్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం న్యాయవాది కార్యాలయానికి వెళ్లి మారుతీరావు కలవాల్సి ఉందని చెప్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆర్య వైశ్య భవన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌నీ పరిశీలిస్తున్నారు. మారుతీరావు మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, అయితే విష ప్రభావంతో శరీరం రంగు మారిందని ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆ విషం కారణంగానే శ్వాస తీసుకోవడం ఆగిపోవడంతోపాటు శరీరంలోని అవయవాలు పని చేయకపోయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. విషం తీవ్రతను బట్టి దాని ప్రభావం శరీరంపై రెండు నిమిషాల నుంచి రెండు గంటల సమయంలో కనిపించి ప్రాణం పోతుందని పోలీసులు చెబుతున్నారు. చదవండి: 'మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు'
కుమార్తె రాజీ అవుతుందని భావించాడు : న్యాయవాది
మారుతీరావు మరణానికి సంబంధించి ఆయన న్యాయవాది వెంకట సుబ్బయ్య సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆయన వరంగల్ జైల్లో కలిసినప్పుడు వెళ్లి కలిశాను. ఎప్పటికైనా కుమార్తె అమృత తన వద్దకు వస్తుందని భావించాడు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న కారణంగా ఆమె రాజీకి ఒప్పుకోలేదు. ఇటీవల ఆధ్యాత్మిక భావన పెరిగింది. తన కుమార్తె కోర్టులో కాంప్రమైజ్ అవుతుందని అనుకున్నాడు. అలా కాకుండా ఆమె మరో కేసు పెట్టింది. ప్రణయ్ కేసులో తనకు శిక్ష పడుతుందని మారుతీరావుకు తెలుసు. ఆ భయం ఆయనలో ఉంది. జీవిత ఖైదుకు అవకాశం ఉందని అనుకున్నాడు. ఆస్తుల వివాదాల విషయాలపై మీడియాలో వచ్చిన వార్తలు విషయం ఆయన్ను అడిగితే నవ్వి ఊరుకున్నారు’ అని అన్నారు. చదవండి: కూతురు రాదనే... మనస్తాపంతోనే
Comments
Please login to add a commentAdd a comment