సాక్షి, ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్రపై లైంగిక వేధింపుల కేసులో సిమ్లా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జితేంద్ర కజిన్ ఇచ్చిన ఫిర్యాదుపై చోటా సిమ్లా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 354 కింద ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సిమ్లా ఎస్‌పీ ఉమాపతి జమ్వాల్ తెలిపారు. 47 ఏళ్ల కిందట జితేంద్ర తనను ఓ సినిమా షూటింగ్‌కు తీసుకువెళ్లి తాను బసచేసిన హోటల్ రూమ్‌లో లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మెజిస్ర్టేట్ ఎదుట నమోదు చేశారు. అప్పట్లో జితేంద్ర వయసు 28 ఏళ్లు కాగా, తన వయసు 18 సంవత్సరాలని ఆమె చెప్పారు. నేరం జరిగినప్పుడు అమల్లో ఉన్న చట్ట నిబంధనలకు అనుగుణంగా కేసును విచారిస్తామని ఎస్‌పీ వివరించారు.
అయితే ఏ హోటల్‌లో వారు బస చేసిందీ..దానికి సంబంధించిన ఆధారాలను ఆమె చూపలేకపోతున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను జితేంద్ర న్యాయవాది రిజ్వాన్ సిద్ధికీ తోసిపుచ్చారు. జితేంద్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకే అవాస్తవ ఆరోపణలను చేస్తున్నారని ఆయన తిప్పికొట్టారు. జితేంద్ర లైంగికంగా తనను వేధించారని, ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్‌ఆర్ మర్ధికి పంపిన ఈ - మెయిల్‌లో కోరారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఓ సినిమా షూటింగ్ సందర్భంగా న్యూఢిల్లీ నుంచి ఆమెను సిమ్లాకు తీసుకువెళ్లారు. ఓ రోజు రాత్రి తాము బసచేసిన హోటల్ గదిలోకి మద్యం సేవించి వచ్చిన జితేంద్ర లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment