
తిరువనంతపురం : కేరళలో 767 రోజులుగా ఓ యువకుడు చేస్తున్న పోరాటం సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండేళ్లుగా యువకుడు సెక్రటేరియేట్ ఎదుట అతను మౌన దీక్ష చేస్తున్నాడు. తన అన్న మృతి కేసులో నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం అత్యున్నత దర్యాప్తు కోసం అతను డిమాండ్ చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుండా పోయింది.
విషయం ఏంటంటే... 2014 మే నెలలో శ్రీజీవ్ అనే యువకుడిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగా అతను విషం తాగి ప్రాణాలు విడిచాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఓ అధికారి కూతురిని ప్రేమించిన కారణంగా పోలీసులే అతన్ని హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారని శ్రీజీవ్ సోదరుడు శ్రీజిత్ చెబుతున్నాడు. కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అధికారులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ శ్రీజిత్ దీక్ష చేపట్టాడు. దీంతో దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం.. కేసులో దర్యాప్తునకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చింది.
నష్టపరిహారం అందినప్పటికీ.. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో శ్రీజిత్ మరోసారి తన నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. సెక్రటేరియట్ ఎదుట ఉన్న బస్టాండ్ వద్ద దీక్షను ప్రారంభించాడు. అలా రెండేళ్లు గడిచినా ఫలితం లేకుండా పోయింది. మధ్యమధ్యలో స్థానిక మీడియాలో వార్తలు వచ్చినా వాటినెవరూ పెద్దగా పట్టించుకోలేదు.
సోషల్ మీడియాలో ఉద్యమంతో..
ఆర్‌పీ శివకుమార్ అనే బ్లాగ్ రచయిత శ్రీజిత్ గురించి జనవరి 1న ప్రత్యేక కథనాన్ని ప్రచురించాడు. అందులో శ్రీజిత్ ఆరోగ్యం క్షీణిస్తోందని.. అయినా అధికారులెవరూ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అప్పుడు మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఆ వార్తను ప్రచురించాయి. దీంతో యావత్ కేరళ యువత శ్రీజిత్‌కు మద్ధతుగా దీక్షా వేదిక వద్దకు చేరుకున్నారు. రెండు రోజులుగా వేదిక వద్దకు వేల సంఖ్యలో యువతీయువకులు తరలి వస్తుండటంతో సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీజిత్‌తో హీరో టొవినో.. పక్కన సంఘీభావం తెలిపేందుక చేరిన యువకులు
ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు శ్రీజిత్‌కు మద్ధతు ప్రకటించారు. నటులు పృథ్వీరాజ్, నివిన్ పౌలీ, టొవినో థామస్‌లు శ్రీజిత్‌కు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు శశిథరూర్, కేసీ వేణుగోపాల్ లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో మంత్రి జితేంద్ర సింగ్‌లను కలిసి సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
సోమవారం సాయంత్రం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. శ్రీజిత్, అతని తల్లి, స్నేహితులతో భేటీ అయ్యారు. సత్వరమే న్యాయం కలిగేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చినప్పటికీ.. అది నెరవేరే దాకా దీక్ష కొనసాగిస్తానని శ్రీజిత్ చెబుతున్నాడు.
సీబీఐ విముఖత...
ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు గత జూలైలో కేరళ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. అయితే అది సత్పలితం ఇవ్వలేదు. దీనికితోడు సీబీఐ కూడా తాము పనిభారంతో ఉన్నామని.. ఈ కేసును దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment