
మణిదీప్ మృతదేహంతో చంద్రంపాలెం పాఠశాల ఆవరణలో ఆందోళన చేస్తున్న బంధువులు
పీఎం పాలెం/ మధురవాడ(భీమిలి): చంద్రంపాలెం పాఠశాలలో విద్యార్థుల నడుమ జరిగిన సంఘటనను అవమానంగా భావించి మనస్తాపంతో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతదేహంలో పాఠశాలలో ఆందోళనకు దిగారు. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం... మారికవలస రాజీవ్ గృహకల్ప బ్లాకు నంబరు 31లో కుటుంబంతో నివసిస్తున్న ఉప్పాడ అప్పలరాజుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మణిదీప్ (15) ఉన్నారు. మణిదీప్ చంద్రంపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం తోటి విద్యార్థులు హేలనగా మాట్లాడారని సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి... సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం పరిశీలించి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
మృతదేహంతో పాఠశాలలో ఆందోళన
కేజీహెచ్ నుంచి మణిదీప్ మృతదేహాన్ని శుక్రవారం తీసుకొచ్చిన బంధువులు నేరుగా చంద్రంపాలెంలోని పాఠశాలలోకి ప్రవేశించి ఆందోళనకు దిగారు. పాఠశాలలో తోటి విద్యార్థి వేధించడం వల్లే మణిదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, పిల్లలు చనిపోయే పరిస్థితులు తలెత్తుతుంటే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పాఠశాలలో చదివే విద్యార్థి చనిపోతే ఉపాధ్యాయులు కనీసం చూడడానికి కూడా రాకపోవడం ఏమిటని బంధువులు మండిపడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పీఎంపాలెం ఎస్‌ఐ గణేష్ సిబ్బందితో సంఘటన స్థలికి ముందుగానే చేరుకొని మృతుని బంధువులకు నచ్చజెప్పడంతో శాంతించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment