
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుపుతున్నారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం మద్దిపి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాస్‌రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. శ్రీనివాసరెడ్డికి చెందిన మల్బరీ తోట, బోరు బావిని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని పచ్చనేతలు హెచ్చరించారు. బాధితుడు శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(ఓటమి భయంతో.. టీడీపీ దాడులు)
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో బుధవారం టీడీపీ కార్యకర్త చెన్నకేశవులు దుర్భాషలాడి వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జ్‌పై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.. అలాగే పుట్లూరు మండలం అరకటివేములలో ఎన్నికల కోడ్ సందర్భంగా బస్‌షెల్టర్‌పై ఉన్న పరిటాల రవి చిత్రపటానికి ఎన్నికల అధికారులు ముసుగు వేశారు. దీంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చిత్రపటం మీద ఉన్న ముసుగును తొలగించి రాద్ధాంతం చేశారు. కళ్యాణదుర్గం మండలం గోళ్లలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసి తిరిగి వెళుతుండగా.. పార్టీ కార్యకర్తలు ధనుంజయ, గురుగప్పలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు.(అరాచకమే.. టీడీపీ నైజం)