
గుంటూరు, తెనాలి: సామాజిక మాధ్యమాలలో ఫేస్‌బుక్ యాప్ ఓ సంచలనాత్మకం. ఫేస్‌బుక్ రాకతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. ఎల్లలు లేని ఈ మాధ్యమంలో ప్రపంచంలోని ఏ వ్యక్తితో అయినా సంభాషించుకునే వెసులుబాటు ఉంటుంది. ఎంతో విలువైన సమాచార మార్పిడితో పాటు దీనిని దుర్వినియోగం చేస్తున్న వారు లేకపోలేదు. తమ వికృత భావాలను, చేష్టలను ప్రదర్శించేందుకు, తమకు నచ్చని వారిని వేధించేందుకు ఆయుధంలా ఉపయోగిస్తున్నారు. పాపం పండినట్టుగా ఒక్కోసారి అడ్డంగా బుక్కవుతున్నారు. తెనాలికి చెందిన ఓ యువకుడి ఉదంతం ఇందుకో నిదర్శనం. విశ్వసనీయ సమాచారం మేరకు..
గత రెండేళ్లుగా ఫేస్‌బుక్‌లో ‘సిద్ధూసౌజి’ పేరుతో ఓ యువకుడి ఖాతా నడుస్తోంది. ఆ ఖాతా నిర్వహించే యువకుడు తన సెల్ఫీతోపాటు, ‘నా భార్య’, ‘నా ప్రేయసి’ అంటూ మరో యువతి ఫొటోను జతచేస్తున్నాడు. ‘మనమిద్దరం కలిసుందాం...తెనాలి పోలీసులు మనల్నేం చేయలేరు’ అంటూ పోస్టింగులు కొనసాగుతూ వచ్చాయి. ఇటీవల అవి శ్రుతిమించి, పోలీసు ఉన్నతాధికారుల ఫొటోలతో ‘మిస్సింగ్’ పోస్టర్లను పెడుతూ వచ్చాడు. అవన్నీ బెంగళూరు నుంచి పోస్టింగు చేస్తున్నట్టుగా సృష్టించాడు. ఇది తెలుసుకున్న పోలీసు అధికారులు కూపీ లాగారు. ఫొటోలోని యువతి (వివాహిత) చిరునామా తెలుసుకుని పిలిపించి విచారించారు. 2016కు ముందు తమ ఇంట్లో ఆరునెలలు అద్దెకు ఉన్న యువకుడు ఇలా చేస్తున్నాడంటూ ఆమె వాపోయింది. అప్పట్లోనే డీఎస్పీకి మౌఖిక ఫిర్యాదు చేయటంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. అది మనసులో పెట్టుకుని వివాహిత ఫొటోలతో పోస్టింగులు పెట్టటమే కాకుండా పోలీసులను టార్గెట్ చేయటంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తన గురించి కూపీ లాగుతున్నారని తెలిసిన ఆ యువకుడు, భీమవరం పరారై తలదాచుకున్నాడు. ట్రేస్ చేసి మరీ అతడిని పట్టుకొచ్చిన పోలీసులు సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment