బ్యాంకు లాకర్‌లో బయటపడిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు పరిశీలిస్తున్న ఏసీబీ ఏఎస్పీ రమాదేవి శరగడం వెంకటరావు (ఫైల్)
విశాఖ క్రైం: ఏసీబీ అధికారులు తవ్వుతున్నకొద్దీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శరగడం వెంకటరావు అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 8 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే భారీగా ఆస్తుల పత్రాలు, బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో దొరికిన బ్యాంకు పాసు పుస్తకాల ఆధారంగా లాకర్లను సోమవారం తెరిచారు. ఆ సమయంలో కనిపించిన బంగారు, వెండి వస్తువులు చూసిన అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎస్‌బీఐ కంచరపాలెం బ్రాంచిలోని లాకరులో 10 కిలోలు వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే బ్రాంచిలోని మరో లాకర్‌లో 1.3 కిలోల బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించారు. మురళీనగర్‌లో గల మహారాష్ట్ర బ్యాంకు లాకరులో 1.8 కిలోల బంగారు నగలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ రమాదేవి మాట్లాడుతూ విచారణ చేపడుతున్నకొద్దీ వెంకటరావుకు సంబంధించిన అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయన్నారు. ఇప్పటికే లాకర్లలోని మూడు కిలోల బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి వస్తువులు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. బంగారం, వెండి వెంకటరావు భార్య, కుమార్తె, కోడలు పేరు మీద ఉన్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా మిగిలిన లాకర్లలో మరికొన్ని స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటిని మంగళవారం పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే వెంకటరావును అరెస్ట చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో ఆదివారం హాజరుపరచగా ఈ నెల 16 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment