మృతి చెందిన అర్జున్, సాకృత
ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్నారులు విగత జీవులుగా పడిపోవడం చూసి ఆ తల్లుల రోదనలు మిన్నంటాయి. ఎంత పనిచేశావు దేవుడా.. మా పిల్లల బదులు మమ్మలను తీసుకుపోలేకపోయావా.. మాకెందుకీ కడుపుకోత.. మేమేం పాపం చేశాం.. ముక్కుపచ్చలారని పిల్లలు పోయారే.. మాయదారి గుంత పాడుగాను.. మా పిల్లలు లేనిది మేం బతికేదెట్ల.. ఎవరికీ ఇలాంటి కష్టం రావొద్దని వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. – రాయపర్తి
రాయపర్తి : మరుగుదొడ్డి గుంత ఇద్దరు చిన్నారుల ప్రాణాలను మింగింది. ఆడుతూ పాడుతూ అందరిని పలకరించే చిన్నారులు మృతిచెందారనే వార్త తెలియగానే గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. సరదాగా ఆడుకుంటూ మరుగుదొడ్డి కోసం తీసిన గుంతల్లో నిలిచిన నీళ్లలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మండలంలోని మైలారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిలువేరు సునీల్, శిరీష, లక్కం రాజు, స్వప్నలు దగ్గరి బంధువులు. లక్కం రాజు రెండేళ్ల క్రితం చనిపోవడంతో భర్త చనిపోయాడని స్వప్న తల్లిగారి ఊరైన మైలారంలోనే జీవిస్తోంది. వీరి పిల్లలు ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఒకరింటికి ఒకరు వెళ్లి ఆడుకుంటారు. సునీల్ ఇంటికి స్వప్న పెద్ద కుమారుడు అర్జున్(8) గురువారం సాయంత్రం ఆడుకుంటానికి వచ్చాడు. ఈ క్రమంలో చిలువేరు సునీల్, శిరీష దంపతుల పెద్ద కుమార్తె సాకృతతో(6)తో కలిసి ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న మరుగుదొడ్డి గుంతలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు పడిపోయారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. సాయంత్రం కాగానే ఇరువురు పిల్లల తల్లిదండ్రులు పిల్లల కోసం వెతికారు. ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో చుట్టు పక్కల పరిసర ప్రాంతాలు వెతుకుతున్న క్రమంలో మరుగుదొడ్డి కోసం తీసిన గుంతలో చిన్నారుల మృతదేహాలు తేలియాడాయి. గుంతలోకి దిగి ఇద్దరిని బయటకు తీశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గత ఏడాదిన్నర క్రితం మరుగుదొడ్డిని నిర్మించేందుకు గుంతలు తీయగా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని ట్యాంకుల నుంచి నీళ్లు ఇంకుతూ మరుగుదొడ్డి గుంతలు నిండాయి. ప్రమాదకరంగా ఉన్న గుంతలను తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఈ విషాదానికి దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment