
మృతిచెందిన యువకులు
పశ్చిమ గోదావరి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్‌షిప్ డే పార్టీ రెండు కుటుంబాల్లో తీరనిలోటు మిగిల్చింది. పార్టీలో మధ్యం సేవించిన ఇద్దరు యువకులు మృత్యువాతపడగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడకు చెందిన కోనగంటి సుధీర్(16)అంబటి ప్రసాద్(16), మడిశర్ల శివ ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే రోజున పార్టీ చేసుకోవాలనుకున్నారు.
ఆదివారం రాత్రి పార్టీలో భాగంగా వారు మధ్యం సేవించారు. కొద్దిసేపటి తర్వాత ఆ ముగ్గురు కూడా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వారిని తణుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో అంబటి ప్రసాద్, కోనగంటి సుధీర్‌లు మృతి చెందగా మడిశర్ల శివ పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ మధ్యం కారణంగానే వారు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురు కూడా మైనర్లు కావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment