వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పక్కన ఇతర పోలీసు అధికారులు
ప్రకాశం, మార్కాపురం: ఫైనాన్స్ కంపెనీల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసిన రైతులు, యజమానుల నుంచి వాటిని మళ్లీ కొనుగోలు చేసి ఫైనాన్స్ కంపెనీలకు సకాలంలో వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన కలగొట్ల శ్రీనివాసరెడ్డి, అర్ధవీడుకు చెందిన వై.మహేష్‌లు మార్కాపురంలోని మహీంద్రా షోరూమ్‌లో ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత ట్రాక్టర్‌ను గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన మొలక రమేష్‌కు విక్రయించారు. ట్రాక్టర్‌కు తాము చెల్లించాల్సిన ఫైనాన్స్‌ను రమేష్ చెల్లిస్తాడనే ఒప్పందంతో విక్రయించారు.
ఫైనాన్స్ కంపెనీకి ప్రతి నెలా చెల్లించాల్సిన నగదు రమేష్ చెల్లించకపోవటంతో గత నెల 10న స్పందనలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు శ్రీనివాసరెడ్డి, మహేష్‌లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్రను ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 11న గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సుందరరావు, రమేష్‌లు అర్ధవీడు మండలం నాగులవరంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నిందితులు మూడు రకాలా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫైనాన్స్ కంపెనీల్లో ట్రాక్టర్‌లు కొన్న రైతులు, యజమానులను మొలక రమేష్ ద్వారా సంప్రదించి వారికి రూ.40 వేలు, రూ.50 వేలు ఇలా చిన్న మొత్తాల్లో డబ్బులు చెల్లిస్తారు. ఫైనాన్స్ కంపెనీకి చెల్లించాల్సిన మిగిలిన బకాయిలు తామే చెల్లిస్తామని నమ్మకంగా చెబుతారు. ట్రాక్టర్ తెచ్చుకుని ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించకుండా ట్రాక్టర్‌ను అమ్ముకుని తప్పించుకుని తిరుగుతుంటారు. జిల్లాలోని అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లిలో రైతులు, యజమానుల నుంచి మొత్తం తొమ్మిది ట్రాక్టర్లను తీసుకెళ్లి మూడు ట్రాక్టర్లను అమ్ముకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బంధువులు, తెలిసిన వారిని ప్రొత్సహించి వారిలో ఒకరి ద్వారా ట్రాక్టర్ షోరూమ్ వారికి రూ.30 వేలు చెల్లించి అవసరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇతరులకు అమ్ముతున్నారు. ఈ విధంగా మూడు ట్రాక్టర్లను రైతుల పేర్లపై తీసుకుని విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
పక్కా మోసం
గుంటూరు జిల్లాలో ఫైనాన్స్ నుంచి ఏడు ట్రాక్టర్లు, కొటక్ మహింద్రా ఫైనాన్స్ నుంచి మూడు ట్రాక్టర్లు, మణప్పురం ఫైనాన్స్ నుంచి ఒక ట్రాక్టర్‌ను, ఇండస్ బ్యాంక్ నుంచి నాలుగు ట్రాక్టర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి నాలుగు ట్రాక్టర్లు, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ నుంచి ఒక ట్రాక్టర్, ఇతర ఫైనాన్స్ కంపెనీల నుంచి 13 ట్రాక్టర్లు.. ఇల్లా మొత్తం 31 ట్రాక్టర్లు తీసుకున్నారు. మొలక రమేష్ తీసుకున్న రెండు ట్రాక్టర్లను కూడా వేరే వారికి విక్రయించారు. పిడుగురాళ్లలోని శ్రీలక్ష్మి ఫైనాన్స్ కంపెనీ నుంచి తన పేరు మీద ఒక ట్రాక్టర్, తనకు తెలిసిన వారి పేరు మీద మరో నాలుగు ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించి ఫైనాన్స్ చెల్లించకుండా తప్పించుకుని నిందితులు తిరుగుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రైవేటు ఫైనాన్స్‌ల నుంచి తీసుకున్న 20 ట్రాక్టర్లకు వాయిదాలు చెల్లించలేదు. మొత్తం మీద 67 ట్రాక్టర్లకు సంబంధించి ఇద్దరు నిందితులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుందర్‌రావు చేసిన మోసం గురించి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇస్తున్నామన్నారు. రైతులు, ట్రాక్టర్ యజమానులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాయమాటలు నమ్మి అపరిచితులకు ట్రాక్టర్లను అప్పగించి మోసపోవద్దని డీఎస్పీ సూచించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ కేవీ రాఘవేంద్ర, అర్ధవీడు ఎస్‌ఐ సాంబశివరావులను డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అభినందించారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం రూరల్ ఎస్‌ఐ కోటయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment