అంతేలే పేదల బతుకులు. అశ్రువులే నిండిన కుండలు. ఉన్న ఊరిలో ఉపాధి లేదు. ఖాళీగా కూర్చుంటే కుటుంబం గడవదు. ఇంకేం చేయాలి. ఎక్కడ పనిదొరికితే అక్కడికి వెళ్లి పని చేసుకుంటూ పొట్ట పోసుకోవాలి. ఈ కోవకే చెందిన ఒడిశా రాష్ట్రవాసులు కొంతమంది పొట్ట చేతబట్టుకుని పనికోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. రోజూ లాగానే పని పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు ముఖం పట్టిన సమయంలో బస్సు బోల్తా కొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
అంతా నిరుపేదలే
బాధితులంతా నిరుపేదలే. కష్టాన్ని నమ్ముకుని ఎక్కడో ఒడిశా, విశాఖ ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేసేందుకు వచ్చారు. మృతులిద్దరూ ఆదివాసీలు. మిగిలిన చాలామంది కూడా ఆదివాసిలే. గాయపడిన 17 మందిలో పిక్కి సత్యవేణి, పిక్కోలు కాసులమ్మ, పిక్కి రాము అనే ముగ్గురు మహిళలు మాత్రం విశాఖ జిల్లాకు చెందిన వారు.
ప్రమాదం ఇలా..
అశ్వినీ రొయ్యల ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకూ మహిళా కార్మికులు నైట్ షిఫ్ట్ చేశారు. డ్యూటీ దిగిన తర్వాత 30 మంది కార్మికులు ఫ్యాక్టరీకి చెందిన మినీబస్సులో సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఉన్న తమ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌కు బయల్దేరారు. బస్సును డ్రైవర్ జయరాజు అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడిందని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి చెందిన బాధితురాలు పిక్కి సత్యవేణి శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనలో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా ముకుందాపురం మండలం చిటికపొంగ గ్రామానికి చెందిన ఉర్లక కళావతి (23) అలియాస్ లిజా, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గైబ మండలం సరికా గ్రామం కాశీనగర్‌కు చెందిన సబర సుందరి (19) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 17 మంది గాయపడగా ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఒడిశాకు చెందిన గురుబారి నాయక్, నాయక్ సీమా అనే మహిళలకు తీవ్రగాయాలు కావడంతో ఐసీయూలో ఉంచారు. ఒడిశాకు చెందిన బిరుసువా గొమాంగో, విశాఖ జిల్లాకు చెందిన పిక్కి రాము అనే ఇద్దరు మహిళలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి స్వల్పగాయాలు కావడంతో వారికి చికిత్స చేసి పంపించారు.
భీమవరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో అశ్వినీ రొయ్యల ఫ్యాక్టరీకి చెందిన మినీ బస్సు గురువారం అర్ధరాత్రి యనమదుర్రు రోడ్డు పీడబ్ల్యూడీ లాకుల సమీపంలో నీరులేని పంటబోదెలోకి తిరగబడటంతో ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మహిళలు అదే ఆస్పత్రిలో సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా 13 మంది మహిళలకు స్వల్పగాయాలు కావడంతో చికిత్స చేసి పంపారు. ఫ్యాక్టరీకి చెందిన డ్రైవర్ జయరాజు అతివేగంగా, అజాగ్రత్తగా మినీ బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.
కేసు నమోదు
పిక్కి సత్యవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భీమవరం వన్‌టౌన్ ఎస్సై ఎస్.సత్యసాయి తెలిపారు. డ్రైవర్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు, సీఐ డి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చూసి వివరాలు తెలుసుకున్నారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ రమణ ఘటనా స్థలానికి వెళ్లి బస్సును పరిశీలించారు. ఫిట్‌నెస్, పత్రాలు సరిగా ఉన్నాయో లేదో విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు.
గందరగోళంగా వివరాలు
మృతులు, బాధితులంతా ఒడిశా, విశాఖకు చెందిన వారు కావడంతో వివరాలు తెలియక గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు పేర్లు సేకరించగలిగినా మృతుల పేర్లు ఎవరెవరివో తెలియలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బాధితుల ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీసులు కోరినా సాయంత్రం వరకూ అందజేయలేదు. మృతదేహాలు అనాథలుగా ప్రభుత్వాస్పత్రి మార్చురీలోనే సాయంత్రం వరకూ ఉన్నాయి. అక్కడ కనీసం ఎవరూ లేరు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతురాలు సుందరి కుటుంబ సభ్యులు ఒడిశా నుంచి రావడంతో ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని గుర్తించడంతో ఆచూకీ తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment