
అబు దాబి : కాబోయే భార్యను ఇడియట్ అని పిలిచినందుకు గాను ఓ వ్యక్తికి 20 వేల దీరామ్‌ల జరిమానతో పాటు 60 రోజుల జైలు శిక్ష విధించారు. వివరాలు.. ఖలీజ్ టైమ్స్ ప్రకారం ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను ఉద్దేశిస్తూ వాట్సాప్‌లో ‘ఇడియట్’ అని మెసేజ్ పెట్టాడు. కేవలం సరదాగా చేసిన ఈ పనికి అతడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇడియట్ అని పిలవడంతో ఆగ్రహించిన అతని ఫియాన్సి ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో అతడు సరదాగా చేసిన పనికి గాను దాదాపు 4 లక్షల రూపాయల జరిమానా చెల్లించడమే కాక ఆరు నెలల జైలు జీవితం గడపబోతున్నాడు.
మన దగ్గర ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు కానీ.. అరబ్ దేశాల్లో మాత్రం సోషల్ మీడియాలో ఇలాంటి పదాలను, నేర పూరిత పదాలను వాడటాన్ని సైబర్ నేరంగా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. దుబాయ్‌లో ఉంటున్న బ్రిటిష్ సిటిజన్ ఒకరు కార్ డీలర్‌ని తిడుతూ మెసేజ్ చేశాడు. దాంతో అతన్ని జైలు పంపించారు.