
తన భర్తపై దాడి చేస్తున్న వారిని ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న భార్య
సాక్షి, హర్యానా : ఓ మహిళ అపరభద్రకాళి అవతార మెత్తింది. తన భర్తను కొట్టి చంపేందుకు ప్రయత్నించిన దుండగుల ముందు అపరకాళిలా మారి వారిని పరుగులు తీయించింది. ఒంటి చేత్తో వారిని ఢీకొని తోకముడిచి పారిపోయేలా చేసింది. ఈ ఘటన హర్యానాకు సమీపంలోని యమునా నగర్‌లో చోటు చేసుకుంది.
ఆమె కుటుంబానికి మరికొందరు వ్యక్తులకు ఎప్పటి నుంచో భూమి తగాదాలు ఉన్నాయంట. దాంతో పొలంవైపు ఒంటరిగా వెళ్లిన తన భర్తపై నలుగురు వ్యక్తులు పెద్ద కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఆమె ఓ పెద్ద కర్ర చేతబుచ్చుకొని వారి నలుగురిని ఎదుర్కొంది. బాగా దెబ్బలు తిని స్పృహతప్పిపోయిన తన భర్తను చూసి కట్టలు తెగే ఆవేశంతో ఒంటి చేత్తో వారిని పరుగులు పెట్టించి భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.