వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన సంచారిజీవి కడమంచి వెంకటేశ్ (28) మృతదేహానికి బుధవారం రీపోస్టుమార్టం చేశారు. మృతదేహం ఖననం చేసిన మూలవాగు వద్ద వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ వైద్యనిపుణులు సుమారు ఆరుగంటలపాటు శవపరీక్ష నిర్వహించారు. వేములవాడలోనే తొలిసారి రీపోస్టుమార్టం చేయడంతో సమీప ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజా, దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
వేములవాడ: రాష్ట్రమంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో జూలై 5న పర్యటించిన సందర్భంగా ఓ వ్యక్తి పర్సు చోరీ చేశాడనే కారణంతో వెంకటేశ్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కేసులు నమోదు చేసి అదేనెల 13న కరీంనగర్ జైలుకు తరలించారు. అక్కడ తీవ్రఅనారోగ్యానికి గురవడంతో జైలు అధికారుల పర్యవేక్షణలో అదేనెల 26న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరిత్స పొందుతూనే వెంకటేశ్ ఆగస్టు 3వ తేదీన చనిపోయాడు. మరుసటి రోజు కుటుంబసభ్యులు వేములవాడ మూలవాగులో ఖననం చేశారు. చేయని నేరం మోసి ఒప్పుకోవాలంటూ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతోనే తన భర్త చనిపోయాడని, దీనిపై నిజానిజాలు తెలికి తీసి, తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య రేణుక హైకోర్టును ఆశ్రయించింది. వివిధ ప్రజాసంఘాలు సైతం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
స్పందించిన హైకోర్టు.. రీ–పోస్టుమార్టం చేసి నివేదికను సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ వైద్యనిపుణులు ప్రొఫెసర్ కృపాల్‌సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాజామొయినుద్దీన్, రజామాలిక్‌ఖాన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు వేములవాడకు చేరుకున్నారు. జిల్లా వైద్యాధికారి ఎ.రాజేశం, ఆర్డీవో పాండురంగారావు, తహసీల్దార్ శ్రీనివాస్, వెంకటేశ్ భార్య రేణుక, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. వీరిసమక్షంలో వెంకటేశ్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. సుమారు 6గంటల తర్వాత సాయంత్రం 5.30 గంటలకు శవపరీక్ష ప్రక్రియ ముగిసింది. నివేదికను సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు సమర్పిస్తామని కృపాల్‌సింగ్ తెలిపారు.
రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి
వెంకటేశ్ ఊరూరా తిరుగుతూ కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలను పోషించుకుండేవాడని, పోలీసులు చోరీ కేసు నమోదు బనాయించి చిత్రహింసలకు గురి చేశారని, దీంతోనే జైలు తీవ్రఅనారోగ్యానికి గురై మృతి చెందాడని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల ఆరోపించారు. మూలవాగులో ఆమె విలేకరులతో మాట్లాడారు. వెంకటేశ్ మృతితో అతడి భార్య రేణుక, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారని అన్నారు. జిల్లా పోలీసులు పౌరహక్కులు ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యు కె.చంద్రన్న, తెలంగాణ పునర్నిర్మాణ మిషన్ ప్రధాన సమన్వయకర్త ఎంఏ షోయబ్, అబ్దుల్ మసూద్, మొహమ్మద్ యూకూబా, శ్రీనివాస్, డీఎల్‌ఎఫ్ నాయకులు మార్వాడి సుదర్శన్, కమటం అంజయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవునూరి ప్రభాకర్, కోనాపురం లక్ష్మణ్, గుండా థామస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, సాగారం వెంకటేశ్, ముడిక చంద్రశేఖర్, ఆకునూరి బాలరాజులు పాల్గొన్నారు.
మమ్మల్ని ఆదుకోండి కడమంటి రేణుక
పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త వెంకటేశ్ మరణించాడని రేణుక ఆరోపించింది. నా భర్త చావుకు కారణమైన ఎస్పీ, సీసీఎస్ ఎస్సై, పోలీసులపై చర్య తీసుకోవాలని వేడుకుంది. తన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని విన్నవించింది.
తహసీల్దార్‌తో వాగ్వాదం
తహసీల్దార్ శ్రీనివాస్‌తో మృతుడి కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. రీపోస్టుమార్టం నివేదిక రూపొందిస్తుండగా.. వెంకటేశ్ మృతికి ఎవరిపైనన్నా అనుమానం ఉందా? అని తహసీల్దార్ అడిగారు. దీంతో ఎస్పీ, సీసీఎస్ ఎస్సై, పలువురు పోలీసుల తీరుతో తన భర్త చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఇందులో ఒకరిద్దరు పేర్లు నమోదు చేసేందుకు తహసీల్దార్ నిరాకరించడంతో ఎందుకు రాయరంటూ మృతుడి కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని ప్రజాసంఘాల నాయకులు జయవింధ్యాల, చంద్రన్న, షోయబ్, మార్వాడి సుదర్శన్, విజయ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment