వివరాలు వెల్లడిస్తున్న ప్రియాంక
పంజగుట్ట: వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని తన భర్త తనను వదిలేసి మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని అంబర్‌పేటకు చెందిన బాధితురాలు ప్రియాంక వాపోయింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తల్లి సుధతో కలిసి వివరాలు వెల్లడించింది. ఇంటిలిజెన్స్ విభాగం (మినిస్టీరియల్ స్టాఫ్)లో పనిచేస్తున్న మొగిలి సాయికుమార్‌తో 2015 ఫిబ్రవరి 10న వివాహం జరిగిందని, పెళ్లి సమయంలో రూ.10లక్షల కట్నకానుకలుగా ఇచ్చామన్నారు. అంబర్‌పేటలోని ఛే నంబర్‌లో కాపురం ఉండేవారమని, అదే సంవత్సరం అక్టోబర్‌లో కుమార్తె జన్మించడంతో అప్పటి నుంచి తనను మానసికంగా వేధించే వాడని తెలిపింది. తనకు మగబిడ్డను కనివ్వాలని, లేని పక్షంలో వదిలేస్తానని బెదిరించే వాడని తెలిపింది. 2016 జూలైలో రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో వేధింపులు ఎక్కువయ్యాయని, చిన్నపిల్లలని కూడా చూడకుండా వారిని తీవ్రంగా కొట్టేవాడని, అదే సంవత్సరం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని వాపోయింది.
తన భర్తకు 2013లోనే మొదటి వివాహం జరిగిందని, అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమె విడాకులు తీసుకుందని తెలిపింది. అంబర్‌పేటలోని చర్చిలో పరిచయమైన అతని సోదరి నేరుగా తమ ఇంటికి వచ్చి అడగడంతో పేదరికం కారణంగా రెండో పెళ్లయినా తాము అంగీకరించామన్నారు. ప్రస్తుతం సాయికుమార్ సిద్దిపేట కమిషనరేట్‌లో ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడని, అక్కడి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్, అంబర్‌పేట పోలీసులు, మానవ హక్కులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కుటంబ పోషణ భారంగా మారిందని, ఇళ్లలో పనిచేసుకునే తన తల్లిపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన భర్త ఒంగోలులో సొంత ఇళ్లు కట్టుకున్నాడని, అక్కడి వెళ్లి ఆరా తీయగా మూడో పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలిసిందన్నారు. తనతో విడాకులు తీసుకోకుండానే మూడో పెళ్లికి సిద్దమైన తన భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది.
Comments
Please login to add a commentAdd a comment