శ్రీనాథ్‌ ఏమయ్యాడు? | Wine Shop Supervisor Missing Case Still Mystery Anantapur | Sakshi
Sakshi News home page

శ్రీనాథ్‌ ఏమయ్యాడు?

Published Fri, Dec 27 2019 8:20 AM | Last Updated on Fri, Dec 27 2019 8:20 AM

Wine Shop Supervisor Missing Case Still Mystery Anantapur - Sakshi

శ్రీనాథ్‌ పని చేస్తున్న మద్యం షాపు ఇదే ,శ్రీనాథ్‌(ఫైల్‌)

సోమందేపల్లి:  పట్టణానికి చెందిన మద్యం షాపు సూపర్‌వైజర్‌ శ్రీనాథ్‌ అదృశ్యం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి డబ్బు ఎత్తుకెళ్లారా అన్నది చర్చనీయాంశంగా మారింది.  వివరాల్లోకెళితే.. శ్రీనాథ్‌ ఇటీవల ప్రభుత్వ షాపులో సూపర్‌వైజర్‌గా నియమితుడయ్యారు. తోటి సిబ్బందితో కలసి వ్యాపార లావాదేవీలు చూసుకునే వాడు. మద్యం షాపులో (సీఆర్‌ఓ నంబర్‌11146) రోజు వసూలైన కలెక్షన్‌ను బ్యాంకులో చెల్లించి సంబంధిత రశీదులను ఎక్సైజ్‌ అదికారులకు అప్పగించేవాడు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మద్యం షాపునకు సంబంధించిన డబ్బును తన వద్దే ఉంచుకున్న శ్రీనాథ్, సోమవారం షాపు తనిఖీ నిమిత్తం వచ్చిన ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీ అనంతరం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల్లో కట్టి రశీదు అప్పగించాలని సూచించారు. దీంతో డబ్బు చెల్లించి రశీదు అప్పగించి వస్తానని చెప్పి షాపు నుంచి బయటకు వెళ్ళిపోయిన శ్రీనాథ్‌ అనంతరం   కనిపించకుండా పోయాడు. సాయంత్రం వరకు ఎదురు చూసిన సిబ్బంది ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా పూర్తీ స్థాయిలో పరిశీలించి, కుటుంబసభ్యులతో విచారించి అనంతరం ఎక్సైజ్‌ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఆత్మహత్య చేసుకున్నాడా?  
శ్రీనాథ్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాలధారణలో వున్న వ్యక్తి గత 4 రోజుల క్రితం పెనుకొండ  మండలానికి ఆనుకుని వున్న కొత్తచెరువు మండలంలో  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్రీనాథ్‌ సైతం మాలధరించి  ఉండడం వల్ల చనిపోయింది శ్రీనాథ్‌ అని, శవం కుళ్లిపోయి ఉండటంతో  పోలీసులు ప్రాథమికంగా శ్రీనాథ్‌ అని నిర్ధారించినా డీఎన్‌ఏ రిపోర్టు కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చే వరకు చనిపోయింది ఎవరన్నది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. 

బెట్టింగ్‌ ప్రభావమేనా?
శ్రీనాథ్‌కు ఆన్‌లైన్‌ బెట్టింగే ఆడే అలవాటు ఉందని పలువురు సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న  మద్యంషాపు డబ్బును ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పొగొట్టుకుని బ్యాంకులో డబ్బు కట్టలేక, అధికారులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే శ్రీనాథ్‌ సన్నిహితులు అనుమానిస్తున్నారు.  బెట్టింగ్‌ లావాదేవీలు సెల్‌ఫోన్‌లోనే జరిపే వాడని,. ఈ క్రమంలో అతడి సెల్‌ఫోన్‌ సైతం మాయం కావడం అంతుబట్టని రహస్యంగా మారింది. అయితే సెల్‌పోన్‌లో జరిపిన లావాదేవీలు, అతడు ఫోన్‌లో అదృశ్యమయిన రోజు జరిపిన సంభాషణలను పోలీçసులు బయటకు తీయగలిగితే కొంత వరకు వాస్తవాలు బయటపడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పలువురు సన్నిహితుల సెల్‌ఫోన్‌లు పోలీసుల వద్ద వున్నాయి. వీటిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.   

బ్యాంక్‌లో కట్టమని చెప్పాం 
సోమవారం మద్యం షాపును తనిఖీ చేసిన అనంతరం 3 రోజులకు సంబంధించిన మొత్తం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులో చెల్లించి రశీదు ఇవ్వమని సూపర్‌ వైజర్‌ శ్రీనాథ్‌కు సూచించాం. అయినా ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. డబ్బుతో తమకు సంబంధం ఉండదు. సూపర్‌వైజర్‌లే బ్యాంకులో చెల్లించాలి.  ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసాం. విచారణ చేస్తున్నారు.– జబీవుల్లా, ఎక్సైజ్‌ ఎస్‌ఐ, పెనుకొండ

లోతుగా విచారిస్తున్నాం  
మద్యం షాపు సూపర్‌వైజర్‌ శ్రీనాథ్‌ అదృశ్యంపై పూర్తీ స్థాయిలో దర్యాప్తు  చేస్తున్నాం. 4 రోజుల క్రితం  కొత్తచెరువు పరిధిలో అయ్యప్ప మాలధారణలో వున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనాథ్‌ సైతం మాలధరించి వుండడంతో అతనేమైనా ఉండొచ్చు అనే కోణంలో విచారిస్తున్నాం. అదృశ్యమైన రోజు ఏ టవర్‌ల కింద ఫోన్‌ సంభాషణలు జరిపాడన్న  విషయమై కాల్‌ డేటా సేకరిస్తున్నాం. – శ్రీహరి, సీఐ, పెనుకొండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement