బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించిన సుర్జీత్ పాండే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. బతికి ఉండగానే ఓ మహిళకు ఇద్దరు వ్యక్తులు నిప్పటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 60 శాతం మేర కాలిపోయింది. ప్రస్తుతం సీతాపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సోదరులైన రాము, రాజేశ్‌లు గత కొంతకాలంగా సదరు మహిళను వేధిస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఆమె తప్పించుకుంది. ఆమె వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ అక్కడ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో బాధితురాలి బంధువులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే.. వారు కూడా అదే పోలీసు స్టేషన్‌కు వెళ్లమని సూచించారు. మరోసారి పోలీసు స్టేషన్ వెళ్లిన కూడా ఆమెకు నిరాశే ఎదురయింది.
కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. తమపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నిస్తుండటంతో నిందితులు ఆమెపై కోపాన్ని పెంచుకున్నారు. ఆదివారం రోజున ఆ మహిళ బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో నిందితులు ఆమెకు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖంతోపాటు, పై భాగం కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పోలీస్ అధికారి సుర్జీత్ పాండే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి బంధువులతో మాట్లాడారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు లైంగిక వేధింపులతో పాటు, హత్యాయత్నం సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన స్పందించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పాండే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment