ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రాఘవులు (ఇన్‌సెట్లో) పోలీసులు స్వాధీనం చేసుకున్న పురుగుముందు డబ్బా
ఒంగోలు క్రైం: ఓ యువకుడు పురుగుమందు డబ్బాతో ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చేందుకు ప్రయత్నించటం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద కలకలం రేపింది. ఎస్పీ బి.సత్య ఏసుబాబు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ వద్దకు వెళ్లాలని ప్రయత్నించాడు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద భద్రత సిబ్బంది సహజ పరిశీనలో అతడి వద్ద పురుగుమందు డబ్బా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు పురుగుమందు డబ్బా స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని ఎస్పీ బి.సత్య ఏసుబాబు వద్దకు తీసుకెళ్లారు. అతడు తన కష్టాన్ని ఎస్పీకి మొరపెట్టుకున్నాడు. చినగంజాం మండలం సంతరావూరుకు చెందిన వడ్డాణం రాఘవులు ఉన్నత చదువులు చదువుకున్నాడు.
తల్లి ఛాయాదేవి, తండ్రి శ్రీరాములు మధ్య ఏర్పడిన మనస్పర్థలతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఇది తనకు మానసిక వేదన కలిగిస్తోందని వాపోయాడు. దీనికి తోడు తండ్రి శ్రీరాములు మరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని, ఆస్తులు హారతి కర్పూరంలా కాజేస్తూ తమను దిక్కు లేని వారిగా చేస్తున్నాడన్నారు. మొత్తం 17 ఎకరాలు పొలం ఉంటే ఇప్పటికే ఐదెకరాలు అమ్మాడని, స్థానిక పోలీసులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటే అది సివిల్ వ్యవహారమని, తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారని పేర్కొన్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్పీని రాఘవులు వేడుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment