పేలుతున్న మాటల తూటాలు ! | A war of words between TDP and BJP | Sakshi
Sakshi News home page

పేలుతున్న మాటల తూటాలు !

Published Thu, Nov 12 2015 9:16 AM | Last Updated on Fri, Aug 10 2018 7:26 PM

పేలుతున్న మాటల తూటాలు ! - Sakshi

పేలుతున్న మాటల తూటాలు !

టీడీపీ విధానాలపై  ఎమ్మెల్సీ సోము విమర్శనాస్త్రాలు
ఏకంగా ప్రధానిపైనే బాణం ఎక్కుపెట్టిన ఎంపీ రాయపాటి
ప్రత్యారోపణల్లో మంత్రి రావెల కిషోర్‌బాబు, మాజీ మంత్రి కన్నా
ప్రధాని పర్యటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీ గల్లా
ఇరు పార్టీల మైత్రీబంధం బీటలు వారుతుందని అంచనా..

 
గుంటూరు : టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ విధానాలపై విమర్శలు ప్రారంభిస్తే, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోదీపైనే బాణం ఎక్కుపెట్టి సంచలనం సృష్టించారు. ఈ విమర్శలు రెండు పార్టీల్లో ఒకేసారి వేడి పుట్టించాయి. నేతల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఇరు పార్టీల మైత్రీ సంబంధాలు రాయపాటి విమర్శలతో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
 
మాటకు మాట అనే రీతిలో ఇటీవల టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరే ఇతర జిల్లాల్లోనూ లేని విధంగా గుంటూరులోని రెండు పార్టీల నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. టీడీపీలో మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, బీజేపీలో సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలు ఇప్పటి వరకు ప్రత్యారోపణలు చేసుకున్నారు.
 
పథకాలకు ఆటంకం కల్పిస్తున్న టీడీపీ

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మిత్రపక్షమైన టీడీపీ విధానాలపై మొదట్లో విమర్శలు చేయడం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టీడీపీ తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని, కొన్ని పథకాల అమలుకు ఆటంకాలు కలిగిస్తోందని విమర్శలు చేశారు. ఆ తరువాత నుంచి టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమరావతి శంకుస్థాపన తరువాత రోజున ఫ్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను వివిధ రాజకీయ పార్టీలు దహనం చేశాయి. ఈ నేపథ్యంలోనే  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పీఎం పర్యటన పట్ల అసంతప్తిని వ్యక్తం చేశారు.
 
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలకు మంత్రి రావెల తీవ్రంగా స్పందించారు. కన్నాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వినుకొండ నియోజకవర్గ పర్యటనలో బిహార్ ఫలితాలపై చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బిహార్, కశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో ఎటువంటి సహాయాన్ని ప్రకటించకుండా పుట్టమట్టి, యమునా నదినీటిని తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కన్నీళ్ల ఫలితమే నరేంద్ర మోదీ మట్టి కొట్టుకుపోయాడని ఘాటుగా విమర్శించారు. బిహార్‌లో బీజేపీ ఓటమి పాలుకావడం ఒకరకంగా టీడీపీ నేతలకు సంతోషం కలిగించే విషయమే అయినప్పటికీ, బాహాటంగా వారెవరూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే రాయపాటి చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతం కాదని, పార్టీలోని అనేక మంది అభిప్రాయమేనని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ నేతల స్పందన ఇంకా ఎదురు చూడాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement