రేడియో సిటీలో సందడి చేస్తున్న అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి..
బంజారాహిల్స్: ప్రపంచ రేడియో చరిత్రలోనే అతిపెద్ద నిడివి గల కథను రేడియో సిటీ 91.1 ఎఫ్‌ఎంలో శ్రోతలకు వినిపించారు. ఈ కథా ప్రారంభాన్ని శ్రీరస్తు శుభమస్తు సినిమా హీరో హీరోయిన్లు అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి విన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని రేడియో సిటీ 91.1 ఎఫ్‌ఎం స్టూడియోలో వీరిద్దరూ సందడి చేశారు. ప్రపంచ అతిపెద్ద రేడియో స్టోరీని రేడియో సిటీలో వినడం ఎంతో బాగుందని వీరు తెలిపారు.
‘రేడియో సిటీ బ్లాక్ బస్టర్ కథ’ పేరుతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. నాలుగు రోజుల పాటు 96 గంటలు ఈ కథను శ్రోతలకు వినిపించనున్నారు. శ్రోతలకు, సినీ ప్రముఖులకు ఈ కథను అంకితం చేశారు. ప్రముఖ గేయ రచయితలు, ప్రముఖ తారలు ఈ కథలో పాల్పంచుకున్నారు. ఎఫ్‌ఎం చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టమని నిర్వాహకులు వెల్లడించారు.