నూజివీడులో దారుణం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆస్తి తగాదాలు పరిష్కరిస్తానని టీడీపీ నాయకుడు చేసిన మోసంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడు లక్కినేని వెంకటేశ్వర్లు, ఆయన భార్య, కుమారులతో టీడీపీ నేత నుతక్కి వేణు ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడని.. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని సంబంధిత ఆస్తులను తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
విషయం తెలిసి వేణును వెంకటేశ్వర్లు నిలదీశాడు. వేణు, అతడి అనుచరుల బెదిరింపులతో ఒక్కసారిగా వెంకటేశ్వర్లు కుప్పకూలిపోయాడు. గుండెనొప్పితో అక్కడిక్కడే మరణించాడు. వెంకటేశ్వర్లు మృతి టీడీపీ నేత నుతక్కి వేణు కారణమని ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వేణుపై కఠిన చర్యలు తీసుకుని ఆస్తుల డాక్యుమెంట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.