
వచ్చే ఏడాది అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీ
గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పామని.. ఇదే ఎంపిక విధానాన్ని కొనసాగిస్తామని.. కొత్త విధానం అమలు చేయడంవల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆర్‌జీయూకేటీ చాన్స్‌లర్ ఆచార్య రాజిరెడ్డి వెల్లడించారు.
వేంపల్లె: గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పామని.. ఇదే ఎంపిక విధానాన్ని కొనసాగిస్తామని.. కొత్త విధానం అమలు చేయడంవల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆర్‌జీయూకేటీ చాన్స్‌లర్ ఆచార్య రాజిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ, ఏవో ఆచార్య విశ్వనాథరెడ్డి, అకడమిక్ డీన్ వేణుగోపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక విధానాన్ని నేరుగా కాకుండా పోటీ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని ఒక అభిప్రాయం వెల్లడవుతోందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను స్థాపించామన్నారు. ఎంపిక విధానం మార్చడం వల్ల అర్బన్ ఏరియాల్లో ఉన్న విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయని.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత విధానాన్ని మార్చబోమన్నారు. వచ్చే ఏడాది రాయలసీమకు సంబంధించి అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి నాలుగు సీట్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి ప్రస్తుతం నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యనభ్యసిస్తామన్నారు.