గౌహతి ఐఐటీతో ఏఎన్‌యూ ఎంవోయూ
డ్రాఫ్ట్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసిన అధికారులు
ఏఎన్‌యూ: గౌహతి ఐఐటీతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎంవోయూ (అవగాహన ఒప్పందం) ఖరారయ్యింది. గౌహతి ఐఐటీ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ బుధవారం ఏఎన్‌యూని సందర్శించారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల తదితర ప్రాంతాల్లో పర్యటించి వసతులు, విద్య, పరిశోధన అంశాలను పరిశీలించారు. అనంతరం పరిపాలనాభవనంలో వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టార్ట్‌అప్ కంపెనీ, ఇంక్యుబేసిన్ సెంటర్, మూక్ ప్రోగ్రామ్స్‌లను వీసీ, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు వివరించారు.
ఏఎన్‌యూలో వసతులు, ప్రమాణాలను ఏఎన్‌యూ ఉన్నతాధికారులు డాక్టర్ ప్రవీణ్‌కు తెలియజేశారు. స్టార్ట్‌అప్ కంపెనీ, ఇంక్యుబేసిన్ సెంటర్, మూక్ కోర్సుల అంశాల్లో ఇరు సంస్థలు కలసి పనిచేయాలని నిర్ణయించాయి. దీనికోసం ఎంవోయూ ఖరారు చేశారు. ఎంవోయూకి సంబంధించిన డ్రాప్ట్ అగ్రిమెంట్‌పై ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ సంతకం చేసి ప్రవీణ్‌కు అందజేశారు. గౌతమి ఐఐటీ తరఫున ఆ సంస్థ ఉన్నతాధికారులతో పత్రాలపై సంతకాలు చేసి పంపుతానని ఆయన యూనివర్సిటీ అధికారులకు తెలిపారు. ఏఎన్‌యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, ఏఎన్‌యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య జీఎస్‌ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.