రాజానగరం: బస్సుల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి భద్రత కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని గైట్ కళాశాల ఆటోమొబైల్ విభాగం విద్యార్థులు రూపొందించారు. అకడమిక్ ప్రాజెక్టులో భాగంగా హెచ్‌ఓడీ వి.సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో టీడీఎస్ సుబ్బారెడ్డి, జి.మణికంఠ, కె.మురళీకృష్ణ, కె.దుర్గాశ్రీకాంత్ దీనిని రూపొందించారు. తొలుత ఒక బస్సు మోడల్‌ని తయారుచేశారు. ఇదే కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న టి. వెంకటశివారెడ్డి సహకారంతో బస్సు క్యాబిన్‌లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తం చేసే వ్యవస్థను రూపొందించారు.
ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అత్యవసర ద్వారం తెరుచుకుని కార్బన్ డై ఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ముందుగా నిర్ణయించిన మొబైల్ నంబర్లకు సంఘటన జరిగిన ప్రాంతం వివరాలను సంక్షిప్తంగా మెసేజ్ పంపిస్తుంది. ఈ వ్యవస్థకు ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ (ఎఫ్‌డీఎస్‌ఎస్) అని పేరుపెట్టారు.