భజే వాయుపుత్రం
– కర్నూలులో వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ
కర్నూలు (న్యూసిటీ): వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీని గురువారం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జమ్మిచెట్టు నుంచి పూలబజార్, రాజ్‌విహార్, కొత్తబస్టాండు మీదుగా శ్రీరామ ఆంజనేయస్వామి దేవాలయం వరకు ర్యాలీ కొనసాగింది. హనుమాన్ చిత్ర పటాన్ని పెట్టుకొని జై శ్రీరామ్.. జై హనుమాన్.. అంటూ పెద్ద ఎత్తున వీహెచ్‌పీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ మందిరాన్ని పార్లమెంట్‌లో చట్టం చేసి నిర్మించాలన్నారు. వీహెచ్‌పీ దక్షిణాంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండుగ నుంచి శ్రీరామోత్సవాల పేరుతో వీరహనుమాన్ విజయయాత్ర ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. రామమందిరం నిర్మాణం కోసం అనేక వీర హనుమాన్ విజయయాత్ర ర్యాలీలు జరిగాయని వీహెచ్‌పీ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య అన్నారు. వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు డాక్టర్‌లక్కిరెడ్డి అమర సింహారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వీహెచ్‌పీ ప్రాంత నాయకులు సందడి మహేశ్వర్, ప్రాణేష్, నగర కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.