బీర్కూర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో బీర్కూర్ మండలం జిల్లాలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. లక్ష్యానికి మించి మొక్కలు నాటి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. మండంలో 6.80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా, 7.22 లక్షల మొక్కలు నాటి ఇతర మండలాలకు ఆదర్శంగా నిలిచింది. మొత్తం 106 శాతం మొత్తం నాటినట్లు ప్రత్యేకాధికారి, డీఎల్‌పీవో హనూఖ్ తెలిపారు.
ప్రణాళిక బద్దంగా ముందుకు..
లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికబద్దంగా ముందుకెళ్లారు. మండల ప్రత్యేకాధికారి, డీఎల్‌పీవో హనూక్, తహసీల్దార్ కిష్టానాయక్, ఎంపీడీవో భరత్‌కుమార్ సారథ్యంలో అన్ని శాఖల అధికారులను రెండు బృందాలుగా విడిపోయారు. పల్లె నిద్ర చేస్తూ హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉపాధి హామీ ఏపీవో హలీం అక్మల్, క్షేత్రస్థాయి సిబ్బంది, గ్రామస్తులంతా కలిసి సమష్టిగా కదిలారు. లక్ష్యాన్ని అధిగమించి మొక్కలు నాటారు. ఎంపీపీ మల్లెల మీనా, మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు కిషన్‌నాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ పర్యవేక్షించారు.
రాష్ట్ర స్థాయిలో గుర్తింపునకు అవకాశాలు..
వ్యవసాయ దినోత్సవం రోజున అన్ని గ్రామాల్లోని పొలం గట్లపై టేకు మొక్కలు నాటారు. శనివారం ఎక్సైజ్ డే సందర్భంగా తిమ్మాపూర్‌లోని చెరువు కట్టపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా ప్రజలు ఈత మొక్కలు నాటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, కూలీలు భాగస్వాములై టార్గెట్‌ను పూర్తి చేశారు. లక్ష్యం సాధించిన తొలి మండలంగా నిలిచిన బీర్కూర్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని డీఎల్‌పీవో హనూఖ్ తెలిపారు. మండలంలోని 17 పంచాయతీల్లో వంద శాతం మొక్కలు నాటడంతో కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రి అభినందనలు..
లక్ష్యాన్ని అధిగమించి జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన బీర్కూర్ మండల ప్రజలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిస్తే జిల్లాలో తన సొంత నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం టాప్ ప్లేస్‌లో నిలవడం హర్షణీయమన్నారు. ప్రతి పంచాయతీలో 40 వేల మొక్కలు నాటే వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.