మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్:
జిల్లాలో సెప్టంబర్ 8న జరగనున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక సంస్థల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఈవీఎంలను సిద్ధం చేయాలన్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 74 ఈవీఎంలు అవసరపడతాయని, మరో 30 ఈవీఎంల కోసం ప్రభుత్వానికి నివేధించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 4న బ్యాలెట్ పేపర్‌ను ఈవీఎంలలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో మండలానికి అదనంగా మరో ఈవీఎంను, వార్డు సభ్యుల ఎన్నికలకు కూడా రిజర్వులో ఉంచాలన్నారు. ఎంపీటీసీ కౌటింగ్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలన్నారు. వచ్చేనెల 7న మెన్, మెటిరియల్‌ను కలెక్టరేట్ నుంచి ఎన్నికల జరిగే ప్రాంతాలకు సిబ్బంది వేళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశఃలో జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, డీఆర్వో శ్రీనివాస్, ఇన్‌చార్జ్ డీపీఓ నారాయణరావు, ఎలక్షన్ డీటీ రాంబాబు, సమాచార శాఖ ఏడీ మహ్మద్ ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.