కేబుల్ వార్
కేబుల్ వార్
Published Sat, Apr 8 2017 12:07 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
నంద్యాలలో సరికొత్త రాజకీయం
- కేబుల్ విస్తరణ పనుల చుట్టూ టీడీపీ నేత ఎత్తులు
– శిల్పా కేబుల్ పనులను అడ్డుకోవాలని ఎస్పీకి భూమా వర్గం ఫిర్యాదు
– అధికార పార్టీలో ఇప్పటికే ఉప ఎన్నికల వేడి
- తాజాగా కేబుల్ వైర్లకు రాజకీయ రంగు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి కేబుల్ వైర్లను తాకింది. శిల్పా కేబుల్ విస్తరణ పనులను అడ్డుకోవాలని భూమా కేబుల్ వర్గం నేరుగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ)కి ఫిర్యాదు చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేబుల్ విస్తరణ పనులను చేపట్టకూడదని.. అయినప్పటికీ శిల్పాకు చెందిన కేబుల్ సంస్థ విస్తరణ పనులను చేస్తుందని ఈ ఫిర్యాదులో భూమా కేబుల్ వర్గం ఎస్పీకి చేసిన పిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి అధికార పార్టీలో కాక పుట్టిస్తోంది. తాజాగా కేబుల్ వార్‌తో ఇది మరింత ముదరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భూమా కేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని నంద్యాల డీఎస్పీని ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది.
ఆది నుంచి వార్
వాస్తవానికి నంద్యాలలో భూమా, శిల్పా వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది రాజకీయాలతో పాటు కేబుల్ బిజినెస్‌లోనూ ప్రస్పుటమవుతోంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నికలు రావడం, అందులో తమ కుటుంబానికే సీటు ఇవ్వాలని భూమా వర్గం కోరుతుంది. మరోవైపు శిల్పా మోహన్‌రెడ్డి తనకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కోవలో ఆయన నేరుగా ముఖ్యమంత్రిని కూడా కలిసి విన్నవించారు. ఒకవేళ తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారు కూడా. అయితే భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ వేడి మరింత రాజుకుంది. తాజాగా శిల్పా కేబుల్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఇది ఇరువర్గాల మధ్య చిచ్చు రాజేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హైకోర్టు ఆదేశాలపైనే ఫిర్యాదు
ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ప్రసారాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నెట్ పథకానికి శ్రీకారం చుట్టింది. నంద్యాల డివిజన్‌లో ఈ పనులను భూమా కేబుల్ సంస్థ దక్కించుకుంది. వాస్తవానికి సైబర్ నెట్ ఉద్దేశాల మేరకు ఇతర కేబుల్ సంస్థలకు చెందిన కేబుల్ తీగలు విద్యుత్ స్తంబాలపై వేలాడకూడదు. అలాంటి కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని స్వయంగా సీఎం ఆదేశించారు. అయితే దీనిపై ఇతర కేబుల్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇదే కోవలో హైకోర్టు కూడా ప్రస్తుతం ఉన్న యధాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ ఆదేశాలకు భిన్నంగా శిల్పా కేబుల్ సంస్థ యధాతథ స్థితిలో ఉంచకుండా విస్తరణ పనులను చేపడుతుందనేది ఇప్పుడు భూమా కేబుల్ సంస్థ వాదన. అందువల్ల ఎస్పీకి చేసిన ఫిర్యాదులో ఎలాంటి రాజకీయం లేదని, కేవలం హైకోర్టు ఆదేశాలపైనే ఫిర్యాదు చేశామనేది భూమా కేబుల్ సంస్థ చెబుతోంది. అయినప్పటికీ కేబుల్ వ్యాపారంలోనూ ఇటు భూమా, అటు శిల్పా వర్గాలు ఉండటంతో రాజకీయ రంగు అలుముకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే సీటు వస్తుందని భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొంటుండగా తమకే వస్తుందని శిల్పావర్గం అంటోంది.
మరోవైపు ఇదే సీటు కోసం మాజీ మంత్రి ఫరూక్, ఎస్‌పీవై రెడ్డి వర్గాలు కూడా ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయ చదరంగానికి తోడు కేబుల్ వ్యాపారంలో పట్టు కోసం సాగుతున్న పోరు నంద్యాల రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఈ పరిణామాలు చివరికి ఎటు దారి తీస్తాయన్నది తేలాల్సి ఉంది.
Advertisement
Advertisement