కృష్ణుడిని బలిగొన్న ‘బుద్దా’ | Chandrababu government attack on temples | Sakshi
Sakshi News home page

కృష్ణుడిని బలిగొన్న ‘బుద్దా’

Published Sun, Jul 3 2016 2:48 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

కృష్ణుడిని బలిగొన్న ‘బుద్దా’ - Sakshi

కృష్ణుడిని బలిగొన్న ‘బుద్దా’

- టీడీపీ ఎమ్మెల్సీ నివాసాల కోసం గుడిని కూల్చేశారు..
- 40 అడుగులూ ఒకవైపే విస్తరించారు..
- ఆలయాల కూల్చివేతలో బాబుసర్కారు చేతివాటం...
- బుద్దా వెంకన్న కోసం గోశాల, కృష్ణుడి మందిరాలు ధ్వంసం
- ప్రత్నామ్నాయ స్థలం కేటాయింపుపైనా దొంగాట
- రూ. 8 కోట్ల స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను
 
 సాక్షి, అమరావతి:
గజనీ, ఘోరీల దండయాత్రలను మించిన స్థాయిలో విజయవాడలో ఆలయాల విధ్వంసం సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. తమ్ముళ్ల ఆస్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ కలగకుండా రక్షణ కల్పిస్తోంది. పుష్కరాల పనులు, రోడ్ల విస్తరణ పేరుతో 30 ఆలయాలను ప్రొక్లైనర్లతో కూల్చివేసిన రాష్ర్టప్రభుత్వం... విస్తరించాల్సిన ప్రదేశంలోనే ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసాన్ని మాత్రం చెక్కుచెదరనీయలేదు. ఆయన నివాసానికి ఏమాత్రం నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఏకపక్షంగా రోడ్డును ఒకేవైపు విస్తరించింది. అందుకోసం దశాబ్దాల నాటి కృష్ణుడి మందిరాన్ని నామరూపాలు లేకుండా పెకలించేసింది.

 విస్తరణ ఒకవైపేనా..?
 అర్జున వీధిలో 40 అడుగుల మేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా రోడ్డును విస్తరించాలంటే రెండువైపులా సమానస్థాయిలో విస్తరిస్తారు. కానీ ఇక్కడ ఆ సూత్రాన్ని మార్చేశారు. రోడ్డుకు ఒకేవైపు ఏకంగా 40 అడుగులు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఎమ్మెల్సీ వెంకన్న నివాసాలు ఉన్నవైపు కాకుండా... ఎదురుగా కృష్ణుడి మందిరం ఉన్నవైపే పూర్తిగా 40 అడుగుల మేర రోడ్డు విస్తరించాలని నిర్ణయించారన్నమాట. అందుకు అడ్డువచ్చిన కృష్ణుడి మందిరాన్ని పూర్తిగా తొలగించేయడానికి కూడా వారు వెనుకాడలేదు. పనివేళలయితే అందరూ గ్రహిస్తారనుకున్నారో ఏమో..  అర్ధరాత్రి వేళ అధికారులు, సిబ్బందిని పంపి ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయ నిర్వాహకులకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. విగ్రహాలను శాస్త్రబద్ధంగా పరిరక్షించే అవకాశం కూడా లేకుండా ఆలయాన్ని కూల్చివేయడంపై అర్చకులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 ప్రత్యామ్నాయ స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను
 అర్జున వీధిలో గోశాల, కృష్ణుడి మందిరాల వెనుక నీటిపారుదల శాఖ భవనం కూడా ఉండేది. గోశాల, కృష్ణుడి మందిరాలను తొలగించినందుకు ప్రత్యామ్నాయంగా  ప్రభుత్వం నీటిపారుదల శాఖకుచెందిన 800 గజాల స్థలాన్ని ఇస్తామని 20రోజుల క్రితం ప్రతిపాదించింది. ఈమేరకు కలెక్టర్ ఆలయ నిర్వాహకులతో చెప్పారు.  దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే గోశాల, ఆలయాన్ని ప్రభుత్వం హడావుడిగా కూల్చివేసింది. ఆలయ నిర్వాహకులకు నోటీసు కూడా ఇవ్వనేలేదు.  ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న నీటిపారుదల శాఖకుచెందిన 800 గజాల స్థలం గురించి కూడా అధికారులు సూటిగా స్పందించడం లేదు.

400 గజాలే అందుబాటులో ఉన్నాయని ఓసారి... అసలు ఆ ప్రదేశంలో స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని మరోసారి ఇలా పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు.  నీటిపారుదల శాఖకు చెందిన ఆ 800గజాల స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను పడిందని తెలుస్తోంది. మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ దాదాపు రూ.8 కోట్లపైమాటే. అంత విలువైన ఆ స్థలాన్ని తమ పరం చేసుకునేందుకు ఆ ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నారు. అందుకే గోశాల, కృష్ణ మందిరం నిర్వాహకులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని అక్కడ కేటాయించలేమని అధికారులు పరోక్షంగా తేల్చిచెప్పేస్తున్నారు. అదే ప్రదేశంలో గోశాల, కృష్ణ మందిరం నిర్మించాలన్న హైందవ ధార్మిక సంస్థల డిమాండుపై ప్రభుత్వం స్పందించడమే లేదు. టీడీపీ నేతల  స్వార్థ ప్రయోజనాల కోసమే ఆలయాల విధ్వంసానికి  చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది.
 
 ఇవిగో సాక్ష్యాలు...

 ఇందులో కనిపిస్తున్నది విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి పాదాల చెంత ఉన్న అర్జునవీధి. ఆ ప్రాంతంలో మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజం రూ.లక్షకు పైగా ధర పలుకుతోంది. ఆ వీధిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయం అనే బోర్డు కనిపిస్తోంది కదా. ఆయన నివాసం కూడా అదే. దానికి ఎదురుగా ఖాళీ ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం వరకు గోశాల, అందులో కృష్ణుడి మందిరం కూడా ఉండేవి. ఆ గోశాలలో దాదాపు 350 ఆవులను సంరక్షించేవారు. కృష్ణుడి మందిరంలో నిత్యపూజలు నిర్వహించేవారు. 60 అడుగుల వెడల్పు ఉన్న అర్జున వీధిని 100 అడుగుల వెడల్పుకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

నిబంధనల ప్రకారం రోడ్డుకు ఒక్కోవైపు 20 అడుగుల చొప్పున రెండువైపులా ఉన్న నిర్మాణాలను తొలగించాలి. అలా చేస్తే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసాన్ని సగం వరకు తొలగించాల్సి వస్తుంది. అదే వరుసలో ఉన్న ఆయనకు చెందిన మరో ఇంటితోపాటు ఆయన ప్రధాన అనుచరుల నివాసాలను కూడా  కూల్చివేయాల్సి ఉంటుంది. ఎంతో విలువైన ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ, ఆయన అనుచరుల నివాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని టీడీపీ ప్రభుత్వం భావించింది. అందుకే అడ్డగోలుగా వ్యవహరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement