2 వేల నోట్లు అవసరం లేదు
► బ్యాంకులుండగా కరెన్సీతో పనేంటి?
► నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మకం
► దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలుంటాయి
► తాత్కాలిక ఇబ్బందుల పరిష్కారానికి సీఎస్, డీజీతో కమిటీ
► ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి : దేశంలో కొత్తగా రెండు వేలు, 500 రూపాయల నోట్లు తీసుకురావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రూ.500, వెయ్యి నోట్లు రద్దు చేశాక మళ్లీ రూ.500, రెండు వేల నోట్లు అందుబాటులో పెట్టడం వల్ల లాభం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ కేంద్రానికి లేఖ రాసే విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఆర్‌బీఐకి సాంకేతిక ఇబ్బందులున్నాయేమో తెలియదు కానీ అసలు బ్యాంకులుండగా కరెన్సీతో అవసరం ఏమిటన్నారు.
ఈ నోట్లను ఎన్నికల్లో వినియోగించే అవకాశం ఉందని, గతంలో 500 ఇచ్చేవారు ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్‌గా రెండు వేలు ఇస్తారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజలు తీసుకుంటే తప్పులేదని, కానీ తాను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే చివర్లో వచ్చిన సూట్‌కేసు గెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో ఏర్పాటుచేసిన క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఆ తర్వాత తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చారిత్రాత్మక నిర్ణయం
ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని, తాను ఆయనకు ఫోన్ చేసి అభినందించానని చంద్రబాబు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలుంటాయన్నారు. దీనివల్ల దేశంలో నీతి-నిజాయితీ పెరుగుతుందని, మెరిట్‌కు ప్రాధాన్యం వస్తుందని చెప్పారు. పేదరికం తగ్గుతుందని, ధరలు నియంత్రణలోకి వస్తాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, దేశానికి లాభాలొస్తాయని, ప్రతిష్ట పెరుగుతుందని తెలిపారు.
అర్థక్రాంతి అనే సంస్థ తన వద్దకొచ్చినప్పుడు దీనిపై చర్చించి ఒక విజన్‌తోనే రూ.500, వెరుు్య నోట్లు రద్దు చేయాలని కోరానన్నారు. ఇటీవల వెలగపూడి సచివాలయంలో తన కార్యాలయాన్ని ప్రారంభించినరోజు ఈ నోట్లు రద్దు చేయాలని కోరుతూ ప్రధాని లేఖ రాశానని తెలిపారు. అదేరోజు డ్వాక్రా మహిళలకు రెండో విడత మూలధనం విడుదల ఫైలుపై సంతకం చేశానని, ఆరోజు చేసిన రెండు సంతకాల ఫైళ్ల లక్ష్యం నెరవేరిందన్నారు. దీన్నిబట్టి వెలగపూడి వాస్తు బాగుందని అర్థమవుతుందని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో 1,650 కోట్ల 500 నోట్లు, 670 కోట్ల వెయియ నోట్లు అమల్లో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. దేశంలో చెలామణీ అయ్యే నగదులో 39 శాతం వెయ్యి నోట్లు, 48 శాతం 500 నోట్లేనని, 85 శాతం నగదు లావాదేవీలు ఈ రెండు నోట్ల ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల నల్లధనం విపరీతంగా పెరిగిపోరుు సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందన్నారు. 2014 ఎన్నికల్లో రూ.30 వేల కోట్లు అనధికారికంగా ఖర్చయ్యాయని అంచనా ఉందని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక నేరాలు, అవినీతి తగ్గుతుందని, టెరర్రిస్టులకు నిధులు రాక ఆగిపోతుందన్నారు. ఇప్పటివరకూ దేశంలో ఒక శాతం బ్లాక్ మనీనే సీజ్ చేశారని, పన్ను కట్టాల్సిన సొమ్ములో 67 శాతం బ్లాక్‌మనీగా ఉందని తేలిందని తెలిపారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.