కేసీఆర్ తో చంద్రబాబు కరచాలనం (ఫైల్ ఫొటో)
- టీ సీఎం కేసీఆర్ కు రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రం అందించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
- టీ మంత్రులను ఆహ్వానించనున్న ఏపీ మంత్రులు
- ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఊహించినదానికంటే మరింత కన్నులపండువగా జరగనుందా? ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు విశిష్ట అతిథులు హాజరుకానున్న వేడుకకు పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించాలనే నిర్ణయం తాజా అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ ముఖ్యాంశాలు..
- ఈ నెల 18న ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసానికి లేదా కార్యాలయానికి వెళ్లి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాలను అందించి.. కార్యక్రమానికి రావాల్సిందిగా కోరతారు.
- అదే సమయంలో ఏపీ మంత్రులు.. తెలంగాణ మంత్రుల నివాసాలకు లేదా కార్యాలయాలకు వెళ్లి ఆహ్వాన పత్రాలు అందజేస్తారు.
- పోలవరం ప్రాజెక్టును తర్వరితగతిన పూర్తిచేసేందుకు చేపట్టవలసిన చర్యలపై కేబినెట్ సమాలోచనలు జరిపింది.
- సంచలనం రేపిన అగ్రిగోల్డ్ కేసు హైకోర్టు విచారణలో ఉన్న దరిమిలా బాధితులకు న్యాయం చేకూర్చేలా ఏవిధమైన చర్యలు చేపట్టాలనే విషయంపై మంత్రివర్గం చర్చించింది.
- తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి నగరం పేరును రాజమహేంద్రవరంగా మార్చుతూ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది.
- రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సమావేశంలో పాల్గొన్న మంత్రులకు అధికారులు వివరించారు.