
మీ యూనియన్ సంగతి తేలుస్తా
పాత్రికేయులపై విరుచుకుపడ్డ సీఎం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘మీకు ఎంతధైర్యం. ప్లకార్డుల పట్టుకుంటే భయపడిపోతానా? వర్కింగ్ జర్నలిస్టులైతే మీకు బాధ్యత లేదా? మీరు చేసిన తప్పులను గుర్తుంచుకోవాలి. మీకు ఎక్కువ గౌరవమే ఇచ్చాం. మీ యూనియన్ సంగతి తేలుస్తా. ఆ యూనియన్ మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో నడుస్తోంది. ఇకపై మీకు సంబంధించిన ఏ కార్యక్రమానికీ నేను రాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రికేయులను తీవ్రంగా హెచ్చరించారు. డెస్క్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, హెల్త్‌కార్డు ప్రీమియం చెల్లించాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలన్న డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) సభ్యులు సీఎం పాల్గొన్న సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం రాయవరంలో సోమవారం ‘జన్మభూమి-మా ఊరు’ సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో ముఖ్యమంత్రి వారిపై చిందులు తొక్కారు. ‘‘న్యాయమైన సమస్య అయితే వచ్చి ఒక పక్కన నిలబడి వినతిపత్రం ఇవ్వండి. సమస్య సరైనది అయితే న్యాయం చేస్తాను. ఒకరిద్దరు వచ్చి గొడవ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కఠిన చర్యలుంటాయి. పది మంది వచ్చి అల్లరి చేస్తే చూస్తూ ఊరుకోం’’ అంటూ హెచ్చరించారు.