కౌడిపల్లిలో నూతనంగా ప్రారంభించిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల
- గిరిజన గురుకులంలో దరఖాస్తులకు ఆహ్వానం
కౌడిపల్లి: మండల కేంద్రమైన కౌడిపల్లిలో ప్రారంభించిన గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నర్సాపూర్‌లో ఏర్పాటు చేయాల్సిన గిరిజన బాలికల గురుకుల పాఠశాలను స్థలాభావం వల్ల కౌడిపల్లిలో ప్రారంభించడం జరిగిందన్నారు.
పాఠశాల భవనంతోపాటు హాస్టల్‌తో కూడిన భవనం అందుబాటులో ఉండటం, మెరుగైన వసతులు ఉండటంతో పాఠశాలను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ విద్యాసంవత్సరం 5, 6వ తరగతుల్లో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.5వ తరగతిలో ఎ, బీ సెక‌్షన్లు, 6వ తరగతిలో ఎ సెక‌్షన్ ఉందన్నారు.
ఒక్కో సెక‌్షన్‌లో 40 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఆయా తరగతిలో 48 మంది అడ్మిషన్లు పొందారని తెలిపారు. మరో 72 సీట్ల ఖాళీగా ఉన్నందున వీటిని కూడా భర్తీ చేస్తామన్నారు. ఆయా తరగతిలో చేరడానికి ఉత్సాహం ఉన్న జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినులు అడ్మిషన్ పొందవచ్చన్నారు. పాఠశాలలో రాత పరీక్ష నిర్వహించి ప్రవేశం కల్పిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు.