వరిలో సస్యరక్షణ తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: సస్యరక్షణ చర్యలు పాటిస్తేనే వరిలో అధిక దిగుబడులు సాధ్యమని ఏరువాక కేంద్రం (డాట్‌సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 22,169 హెక్టార్లు కాగా, ప్రస్తుతానికి 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో నాట్లు వేశారన్నారు. వరికి తెగుళ్లు, పురుగులు ఆశించినందున సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని సూచించారు.
ఆకుముడత నివారించాలి
కాల్వల కింద నీళ్లు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం ఎక్కువగా బోర్ల కిందే వరి నాట్లు వేస్తున్నారు. నాటిన ప్రాంతాల్లో అక్కడక్కడా ఆకుముడుత ఆశించి నష్టం కలిగిస్తోంది. ఉధృతి ఎక్కువైతే ఆకులు తెల్లగా మారుతాయి. కంకి, గింజ దశలో పురుగు ఆశిస్తే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఆకుముడుత నివారణకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. గొంగలి పురుగు ఆకుముడుతలో ఉంటూ పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు తెల్లబడిపోతాయి. దిగుబడులు బాగా తగ్గిపోతాయి. నివారణలో భాగంగా పిలకదశలో తాడు తీసుకుని చేనుకు అడ్డంగా రెండు మూడు సార్లు లాగితే పురుగులు కింద పడిపోతాయి. ఆ తర్వాత 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 గ్రాములు కాపర్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.25 మి.లీ ఫ్లూబెండమైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 8 కిలోలు కార్భోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి.
కాలిబాటలు తప్పనిసరి
వరిలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల మేర కాలిబాటలు వదులుకుంటే గాలి, వెలుతురు పంటకు బాగా ప్రసరించడంతో పాటు ఎరువులు, పురుగు మందుల పిచికారీకి అనువుగా ఉంటుంది. వరికి అక్కడక్కడా సుడిదోమ ఆశించినందున ఎకరాకు 330 మి.లీ అఫ్లాడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే అక్కడక్కడా పొడతెగులు కనిపిస్తున్నందున నివారణకు ప్రస్తుతం పైపాటుగా నత్రజని ఎరువులు వేసుకోకూడదు. మురుగు నీరు లేకుండా జాగ్రత్త పడాలి. 2 మి.లీ హెక్సాకొనజోల్ లేదా 2 మి.లీ వాలిడామైసిన్ లేదా 1 మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వరిలో కాండంతొలిచే పురుగు నివారణకు 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.