తప్పుడు హెచ్ఐవీ రిపోర్టు ఎంత పని చేసింది..
చండూరు (నల్లగొండ): ఆ దంపతులకు హెచ్‌ఐవీ లేదు. కానీ ఉన్నట్టు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతో వారి జీవితంలో ఎన్నో మలుపులకు దారి తీసింది. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు చండూరు మండల కేంద్రానికి కొంతకాలం క్రితం వలస వచ్చారు. స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇటీవల ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి భార్య గర్భం దాల్చింది. ఈ నెల 1న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించుకుంది. హెచ్‌ఐవీ సోకిందని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చూపించుకోవాలని అక్కడికి రెఫర్ చేశారు. దీంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అదే రోజు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వారి బంధువు పలుమార్లు ఫోన్ చేసి అది తప్పుడు రిపోర్ట్ అంటూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. దీంతో వారు నిర్ణయాన్ని మార్చుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ పరీక్షలు చేయించుకున్నారు. హెచ్‌ఐవీ లేదని వెల్లడి కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వైద్యురాలితో వాగ్వాదం
కాగా, జరిగిన విషయాన్ని బాధితులు వివిధ పార్టీల నాయకులకు వివరించారు. బుధవారం వారితో వెళ్లి సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలిని నిలదీశారు. బాధితురాలికి హెచ్‌ఐవీ పరీక్ష నిర్వహించగా అనుమానం కలిగిందని, అందుకే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి సిఫారసు చేసినట్టు చెప్పారు. సిబ్బంది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని, తన తప్పేమీ లేదని పీహెచ్‌సీ వైద్యురాలు స్వర్ణలత వివరణ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.