ధ్వజమెత్తిన సీపీఐ రాష్ట్ర సమితి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల అండతో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి వంటి నల్లకుబేరులు రూ.వందల కోట్లను తెల్లడబ్బుగా మార్చుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం విస్మయం కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర సమితి ధ్వజమెత్తింది. ఏ ప్రభుత్వ అధినేత అండతో శేఖర్‌రెడ్డి రూ.70 కోట్ల కొత్త కరెన్సీని సంపాదించారో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ఘరానా మోసగాళ్లకు చంద్రబాబు ఎలా పదవులు కట్టబెట్టారో చెప్పాలని నిలదీసింది.
రెండు రోజులుగా విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం మీడియాకు విడుదల చేశారు. శేఖర్‌రెడ్డి ఇంట్లో వందల కోట్ల డబ్బు, కిలోల కొద్దీ బంగారం దొరికిన తర్వాత టీటీడీ బోర్డు నుంచి తీసేసినంత మాత్రాన చంద్రబాబు పాపం ప్రక్షాళన అయిపోదని, ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. టీటీడీ బోర్డులో వ్యాపార, వాణిజ్యవేత్తలను నియమించవద్దని ప్రభుత్వాన్ని కోరారు.