వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అక్టోబరు మొదటి వారంలో ఉప ఎన్నికల షెడ్యూల్ వస్తుందని సమాచారంతో పార్టీలు పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. వామపక్షాలు, ప్రజాసంఘాలు బలపరిచే అభ్యర్థిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ బరిలో దిగనున్నారు. గాలి వినోద్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని వామపక్ష పార్టీల నేతలు వరంగల్‌లో మంగళవారం ప్రకటించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.గౌస్, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీల నాయకులతోపాటు వివిధ సామాజిక సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వరంగల్ జిల్లా వాసి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన గాలి వినోద్‌కుమార్ ఆశయాలు, ఆలోచనలను గుర్తించి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాం’ అని నేతలు తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికలో తొలి అభ్యర్థి ఖరారు కావడంతో రాజకీయ పార్టీల్లో జోరు మొదలవుతోంది. వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి రాష్ర్ట డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పార్లమెంట్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో డిసెంబరు 15లోపు వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.
మార్పు కోసం: గాలి వినోద్‌కుమార్
అంబేద్కర్ వారసుడిగా పూలే ఆశయాలను నేరవేర్చడం తన లక్ష్యమని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. బహుజనులను, పీడీత వర్గాలకు బాగు కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఒక్కడి తోనో, ఆయన కుటుంబ సభ్యులతోనో తెలంగాణ రాష్ట్రం రాలేదని చెప్పారు. వామపక్ష పార్టీల నాయకులు ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్ జిల్లా గోవిం దరావుపేటలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమన్నారు.