
అమ్మాయి ఆశ చూపించి హత్యలు
శ్రీకాళహస్తి: యువతులను ఆశ చూపించి హత్యలు చేసే ముఠాను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకట కిశోర్ స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2015 డిసెంబర్ 23వ తేదీన పట్టణంలోని నగిరివీధిలోని ఓ లాడ్జీలో శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.
చెన్నైకు చెందిన విజయుణ్, సురేష్ అనే ఇద్దరు సత్యారామచంద్రన్ అనే యువతిని పలువురికి ఆశ చూపించి బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని, ఎదురుతిరిగిన వారిని హత్య చేస్తున్నారని తెలిపారు. వారు గతనెల 22వ తేదీన శ్రీకాళహస్తిలోని నగిరి వీధిలో అద్దెకు రూమ్ తీసుకుని పక్క రూమ్‌లో ఉన్న శ్రీనివాస్‌కు సత్యారామచంద్రన్‌ను ఆశ చూపించారని తెలిపారు. తర్వాత శ్రీనివాస్ వద్ద ఉన్న రూ.6 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని బెదిరించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ ప్రతిఘటించడంతో హత్య చేశారని వివరించారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండవునాడు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయున్, సత్యారామచంద్రన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసిందన్నారు. సురేష్‌ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. కేసును త్వరగా ఛేదించిన కానిస్టేబుళ్లు గోపి, చంద్రశేఖర్, సుబ్రమణ్యంను డీఎస్పీ అభినందించారు. గుర్తింపు ఉంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని లాడ్జీ నిర్వాహకులను ఆదేశించారు. సీఐ చిన్నగోవింద్, ఎస్‌ఐ సంజీవ్‌కువూర్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.