తాండూరు రూరల్ (రంగారెడ్డి జిల్లా): తల్లి కళ్లెదుటే కన్నపేగు కానరాని లోకాలకు తరలిపోయింది. రోడ్డు పక్కన ఉన్న తల్లీకూతుళ్లను మృత్యువు రూపంలో వచ్చిన లారీ ఢీకొంది. కూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా తల్లికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గురువారం తాండూరులో చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ నాగార్జున, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం ఊడిమేశ్వరం గ్రామానికి చెందిన సుమిత్ర, జనార్దన్‌లు కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతుళ్లు రోజ, స్వప్న(5) ఉన్నారు.
బతుకుదెరువు కోసం 5 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు తాండూరుకు వలస వచ్చారు. పట్టణంలోని పాత శాలివాహన సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అక్కడే అద్దె గదిలో నివాసముంటున్నారు. కూతుళ్లు రోజా, స్వప్నలు స్వగ్రామం ఊడిమేశ్వరంలోనే సుమిత్ర తల్లిదండ్రుల వద్ద ఉంటూ అక్కడే చదువుకుంటున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సుమిత్ర చిన్న కూతురు స్వప్నను తాండూరుకు తీసుకొచ్చింది. సెలవులు ముగియడంతో స్వప్నను స్వగ్రామం పంపిద్దామని గురువారం సుమిత్ర పాలిషింగ్ యూనిట్ నుంచి గంగోత్రి పాఠశాల ఎదురుగా తాండూరుకు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడింది. అంతలోనే మృత్యురూపంలో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్న ఓ లారీ తల్లీకూతుళ్లను ఢీకొంది.
ఈ ప్రమాదంలో తల్లీకూతురు గాయపడ్డారు. అప్పటికే లారీ డ్రైవర్ పరారయ్యారు. స్థానికులు గమనించి వారిని పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్వప్నను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారికి గుండె భాగంలో బలమైన గాయాలు కావడంతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. తన కళ్లెదుటే కూతురు చనిపోవడంతో సుమిత్ర షాక్‌కు గురైంది. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఆమె కూతురు స్వప్న మృతదేహంపై రోదించిన తీరు హృదయ విదారకం. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి కళ్లెదుటే కూతురి దుర్మరణం
Published Thu, Jan 21 2016 9:57 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement